
శ్రీకాంత్ రెడ్డి
నిరంకుశ పాలనను నిలదీస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: నిరంకుశ పాలనను నిలదీస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని టిడిపి నేతలు కాలరాస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో టిడిపి నేతలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. తెలుగు తమ్ముళ్లు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. దౌర్భాగ్య రాజకీయాలు మానుకోమని సలహా ఇచ్చారు. టిడిపి నేతల ప్రవర్తన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మీరిలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం అన్నారు. ప్రజలంతా తిరగబడి గుణపాఠం చెబుతారుని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.