‘ప్రత్యేక హోదా’ లేనట్టే! | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక హోదా’ లేనట్టే!

Published Tue, Jan 27 2015 1:12 AM

‘ప్రత్యేక హోదా’ లేనట్టే! - Sakshi

  • దీనిపై ఎక్కువగా మాట్లాడొద్దు
  • మంత్రులకు సీఎం  సూచన
  • శాఖల వారీగా నిధులు సాధించుకోవడమే మేలు
  • బీజేపీపై విమర్శలు, ఆరోపణలు చేయొద్దు
  • సాక్షి , విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గ సహచరులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై పదే పదే మాట్లాడవద్దని కూడా వారికి సూచించారు. అదేవిధంగా.. టీడీపీలోని ఏ స్థాయి నేతైనా బీజేపీపై విమర్శలు, ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలని మంత్రులను ఆదేశించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పదే పదే కేంద్రం వద్దకు వెళ్లి అవమానపడ డం కంటే  ప్రత్యామ్నాయాలు చూసుకోవడమే ఉత్తమమని సీఎం అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

    దావోస్ పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాదుకు చేరుకున్న చంద్రబాబు.. సోమవారం విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విజయవాడలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు. దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆక ర్షణకుగాను తాను చేసిన యత్నాలను వివరించారు. ఈ సందర్భంగా.. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే అర్థం వచ్చేలా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనను సీఎం దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది.

    దీనికి సీఎం బదులిస్తూ కేంద్రప్రభుత్వం కూడా తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతోందని అన్నట్లు సమాచారం.  కేంద్ర ప్రభుత్వమే.. తాము రూ. లక్ష కోట్ల లోటులో ఉన్నామని చెప్తుంటే.. ఇక వారు మనకు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు, ఎలా సాయం చేస్తారని సీఎం అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మనం కేంద్రంపై పెద్దగా ఒత్తిడి చేయలేమని సీఎం  చెప్పినట్టు సమాచారం.

    మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆర్థిక సాయం చేయడానికి, పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి మిగిలిన రాష్ట్రాలు అంగీకరించే పరిస్థితి లేదని కేంద్రం చెబుతోందని సీఎం మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారని తెలిసింది. ఈ ప్రతిపాదన వచ్చిన తొలిరోజుల్లోనే అప్పటి తమిళనాడు సీఎం జయలలిత బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా సీఎం గుర్తు చేసినట్లు సమావేశంలో పాల్గొన్న మంత్రి ఒకరు తెలిపారు.

    రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చామనీ, ఇప్పుడు  హోదా రావడం లేదంటే విపక్షాలు, ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని  మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై  మంత్రుల సహా పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దనీ, కేడర్ కూడా బీజేపీ మీద ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది.
     
    కాంగ్రెస్‌పై నెట్టేద్దాం..:అప్పట్లో.. కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని హడావుడిగా విడగొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి ప్రత్యేక హోదా సాధించలేకపోయామనే అపప్రధ నుంచి బైట పడేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ఒకరిద్దరు మంత్రులు ఈ సందర్భంగా సీఎంకు సూచించారు. అయితే, ఫిబ్రవరి 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చించి అప్పుడు ఒక నిర్ణయానికి వద్దామని సీఎం అన్నట్లు తెలిసింది.

    శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోసం ప్రతిపాదనలు తయారు చేసి వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించుకోవడానికి ప్రయత్నిద్దామని మంత్రులకు ఆయన చెప్పినట్టు సమాచారం. వాటిపై మంత్రులు దృష్టి పెట్టాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం తన బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిని రాబట్టి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామని సీఎం సూచించారు. రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం   పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసే అవకాశం లేనందువల్ల ప్రైవేట్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి సారించాలని సీఎం అన్నారు.
     
    మంత్రివర్గ భేటీ వాయిదా..


    మంగళవారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదా పడింది.  భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ దొరుకుతుందన్న భావనతో ఉన్న చంద్రబాబు.. ఈ భేటీని వాయిదా వేశారు.అటు నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిసింది.కాగా మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు కెనడా ప్రతినిధి బృందంతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement