‘నేను తీవ్రవాదిని కాదు..’ | Sakshi
Sakshi News home page

‘నేను తీవ్రవాదిని కాదు..’

Published Wed, Jul 26 2017 3:16 PM

‘నేను తీవ్రవాదిని కాదు..’

కిర్లంపూడి: ‘మా జాతికి స్వేచ్ఛ లేదు. నేను తీవ్రవాదిని కాదు, నాపై కేసులు ఉంటే ఇప్పుడే అరెస్ట్‌ చేయాల’ని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టుబట్టారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని పోలీసులను చేతులు జోడించి వేడుకున్నారు.  శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని ముందే చెప్పామని, పోలీసులు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే యాత్ర మొదలు పెడతానని ముద్రగడ అన్నారు.

చలో అమరావతి పాదయాత్ర చేపట్టేందుకు ఈ ఉదయం 10 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయటకు వచ్చారు. 10.13 గంటలకు పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం తర్వాత 10.37 గంటలకు తన నివాసంలోని తిరిగి వెళ్లిపోయారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ముద్రగడను పోలీసులు గృహనిర్భంధం చేశారు.

మరోవైపు ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపులు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగ్గన్నపేటలో జాతీయ రహదారిపై పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాపు నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్‌లు, నిర్బంధాలు, ఆంక్షలపై కలెక్టర్‌కు కాపు ఐక్య గర్జన న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. సాధారణ ప్రజలపై బైండోవర్‌ కేసులు పెట్టడం దారుణమని, పోలీస్‌ అధికారులు చట్టప్రకారం నడుచుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని, అక్రమ అరెస్ట్‌లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటే ఆమరణదీక్ష చేస్తానని పశ్చిమగోదావరి జిల్లా కాపు సంఘం నేత చినిమిల్లి వెంకటరాయుడు హెచ్చరించారు.

Advertisement
Advertisement