లారీ హైజాక్ పలమనేరు గ్యాంగ్ పనే | Sakshi
Sakshi News home page

లారీ హైజాక్ పలమనేరు గ్యాంగ్ పనే

Published Mon, Sep 22 2014 2:59 AM

Larry hijack way palamaneru Gang

నెల్లూరు(క్రైమ్): ఖరీదైన వస్తువులను రవాణా చేసే లారీలే వారి లక్ష్యం. మొదట ఆయా వస్తువుల తయారీ కేంద్రాల వద్ద మాటేస్తారు. అక్కడి నుంచి బయలుదేరిన లారీలను వెంబడిస్తారు. ప్రయాణికుల ముసుగులో లారీ ఎక్కి జనసంచారం లేని ప్రాంతాల్లో డ్రైవర్లను హతమారుస్తారు. అనంతరం లారీని ఎత్తుకెళ్లి సరుకును అమ్మి సొమ్ము చేసుకోవడమే వారి వృత్తి. ఇలాంటి నరహంతక ముఠాలు చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. నాలుగు రోజుల కిందట తమిళనాడులోని తూత్తుకుడి నుంచి గుజరాత్‌కు కాపర్ ప్లేట్లతో బయలుదేరిన లారీని కూడా పలమనేరుకు చెందిన గుండగల్లు శ్రీరాములు గ్యాంగ్ హైజాక్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పలమనేరు సమీపంలోని లారీ డ్రైవర్లు శరవణన్, శ్రీకాంత్‌ను చంపి లారీని హైజాక్ చేశారు. వారి మృతదేహాలను శుక్రవారం రాత్రి గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో పడేశారు.

తమిళనాడుపోలీసులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు దగదర్తి మండలం సు న్నపుబట్టి వద్ద కాపర్‌ప్లేట్ల లారీతో పాటు హైజాకర్లు వినియోగించిన మరో ఖాళీ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్యాంగ్‌లోని శ్రీరాములు, శివకుమార్, రోషన్ పోలీసులకు చిక్కగా జనార్దన్, మురళి, భరత్ పరారయ్యారు. చిక్కిన వారిచ్చిన సమాచారంతో పంబలేరు వాగులో నుంచి మృతదేహాలను వెలికితీశారు.ఎంతటి కిరాతకానికైనా సిద్ధహస్తులుపలమనేరుకు చెందిన గండగల్లు శ్రీరాములు, గంటావూరుకు చెందిన శివకుమార్, కాకుతోపునకు చెందిన రోషన్, జనార్దన్, మురళీ, భరత్ ఓ గ్యాంగ్. లారీలను హైజాక్ చేసి అందులోని డ్రైవర్లను మట్టుబెట్టి విలువైన వస్తువులను దోచుకెళ్లడం వీరికి వెన్నతో పెట్టన విద్య. వీరు రెండు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం  కర్మాగారాల వద్ద రెక్కీ నిర్వహిస్తే, మరో బృందం కొద్దిదూరంలో ప్రయాణికుల ముసుగులో రోడ్డుపై ఉంటారు. సరుకుతో బయలుదేరిన లారీని రెక్కీ బృందం వెంబడిస్తూ మరో బృందంలోని సభ్యులను ఫోన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అనంతరం ప్రయాణికుల ముసుగులో లారీ ఎక్కి జనసంచారం లేని చోట డ్రైవర్లపై దాడి చేసి మరో లారీలోకి మారుస్తారు. నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత డ్రైవర్ల మెడకు ప్లాస్టిక్ వైరు బిగించి చంపడం లేదా పదునైన కత్తులతో నరికేస్తారు. మృతదేహాలను అటవీ ప్రాంతాల్లోని ఇసుకలో పూడ్చిపెడుతుంటారు. ఈముఠాపై ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో లెక్కకు మించిన నేరాలున్నాయి. పలమనేరు ప్రాంతంలో ఇలాంటి గ్యాం గులు రెండు ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మున్నా గ్యాంగ్ ఈతరహాలో నేరాలకు పాల్పడింది.
 ముఠాకు ఆధ్యుడు శ్రీరాములే
 ఈ ముఠాలకు ఆధ్యుడు చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండువల్లు వాసి శ్రీరాములే. 20 ఏళ్లుగా లారీ డ్రైవర్ వృత్తిలో ఉంటున్న శ్రీరాములు తొలి నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. లారీలో విలువైన సరుకులు ఎత్తుకొని వాటిని అమ్మకానికి పెట్టి దొంగతనానికి గురయ్యాయంటూ లారీ యజమానులను మోసగించేవాడు. ఇతనిపై ముంబై, గుజరాత్, గోవా, బెంగళూరు, తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో 30కిపైగా కేసులు ఉన్నాయి. తేలని కేసులు లెక్కలేనన్ని. లారీ డ్రైవర్ వృత్తి మానుకున్న శ్రీరాములు హత్యలు, దోపిడీలు చేయ డం మొదలుపెట్టాడు. ఏకంగా గ్యాంగ్‌కే లీడరయ్యాడు. ఈ గ్యాంగ్‌లో కీలక వ్యక్తి శివకుమార్. చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు కాలనీకి చెందిన శివకుమార్ శ్రీరాములకు ప్రధాన అనుచరుడు. వీరు ఏడాదిన్నర క్రితం మొలకల చెరువు వద్ద ఇద్దరిని హత్యచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన ఓ హత్యలోనూ వీరి పాత్ర ఉన్నట్లు తెలిసింది.
 వీడిన ఉత్కంఠ
 చిల్లకూరు: హైజాక్‌కు గురైన లారీ డ్రైవర్లు మృతదేహాలు బయటపడడంతో ఉత్కంఠ వీడింది. మృతదేహాల కోసం చిల్లకూరు ఎస్సై దశరథరామారావు సిబ్బందితో పాటు తమిళనాడు పోలీసులతో కలిసి శనివారం అర్ధరాత్రి వరకు గాలించారు. జాతీయ రహదారిపై కల్వర్టులు, బ్రిడ్జీలను పరిశీలించారు. ఆదివారం ఉదయం పంబలేరు బ్రిడ్జి సమీపంలో మృతదేహాలు లభ్యమవడంతో గాలింపు చర్యలను ముగించారు.
 పలు కేసుల్లో ‘పంబలేరు’
 గూడూరు రూరల్: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న పలు ఘటనలకు సంబంధించి మృతదేహాలు పంబలేరులో వెలుగుజూస్తున్నాయి. 2012 జూలై 14న ఓ కేసుకు సంబంధించి రెండు మృతదేహాలు ఇక్కడ బయటపడ్డాయి. అదే అక్టోబర్‌లోనూ మరో మృతదేహం లభ్యమైంది. తాజాగా తమిళనాడు డ్రైవర్ల మృతదేహాలను కూడా కిడ్నాపర్లు ఇక్కడే పడేశారు.
 
 
 

Advertisement
Advertisement