తాడిపత్రిలో చెలరేగిపోతున్న గ్రానైట్‌ మాఫియా | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో చెలరేగిపోతున్న గ్రానైట్‌ మాఫియా

Published Sat, Nov 11 2017 6:10 AM

granite mafia in Anantapur district  - Sakshi

తాడిపత్రి: నిజాయతీ అధికారికి బదిలీ సన్మానం చేసిన తాడిపత్రి మాఫియా.. అడ్డూఅదుపు లేకుండా గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కడా క్వారీలు లేకపోయినా.. వ్యాపారం కోట్లలో సాగుతుండటం గమనార్హం. ప్రకాశం జిల్లా చీమకుర్తి, కర్నూలు జిల్లా ఆదోని, డోన్, కదిరి, కనికిగి, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని క్వారీల నుంచి ఇక్కడికి గ్రానైట్‌ గుండ్లు సరఫరా అవుతున్నాయి. ఒక లోడు గ్రానైట్‌ బోల్టర్లు క్వారీ నుంచి ఫ్యాక్టరీకి చేరాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ఇక్కడే దందా మొదలవుతోంది. లగాన్‌ బృందం రంగంలోకి దిగి అధికారుల చేతులు తడుపుతూ పని కానిచ్చేస్తోంది. మైనింగ్‌ లీజుదారులు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. సేల్‌ట్యాక్స్‌ 12శాతం చెల్లించి ఒక్కో గుండు కొలతను బట్టి రాయల్టీ మీటరుకు రూ.3వేలు చొప్పున చెల్లించాలి. కానీ కొన్ని క్వారీల్లో నాసిరకం గుండ్లు ఉండడం వల్ల మంచి గుండ్లకు, నాసిరకం గుండ్లకు ఒకటే రాయల్టీ ధర నిర్ణయించడంతో క్వారీ లీజుదారులు, ప్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై క్యూబిక్‌ మీటరు రూ.60వేల నుంచి రూ.70వేల విలువ చేసే ఖనిజానికి.. మీటరు రూ.7వేల విలువ చేసే ఖనిజానికి ప్రభుత్వం తేడా లేకుండా ఒకే ధరను నిర్ణయించింది. దీంతో తాడిపత్రి లాంటి ప్రాంతాలకు నాసిరకం గుండ్లను తరలించడంతో ఈ సమస్య ఉత్పన్నమౌతోంది. జీఎస్టీలో కూడా ట్యాక్స్‌ బిల్లు వేసేటప్పుడు అధిక ధర కలిగిన ఖనిజానికి తక్కువ ధర కలిగిన ఖనిజానికి విలువలో తేడా లేకుండా బిల్లు వేస్తున్నారు. దీంతో ఒంగోలు లాంటి పారిశ్రామిక ప్రాంతంతో పోల్చుకుంటే ఇక్కడ తేడా భారీగా ఉంటోంది.

మామూళ్ల కోసం మాయాజాలం
గ్రానైట్‌ రాయి ఐదువేల అడుగులు ఉంటే ఫ్యాక్టరీ యజమానులు 2,500 అడుగులకు మాత్రమే బిల్లు తయారు చేస్తారు. చెక్‌పోస్టు వద్ద అక్కడున్న అధికారుకులకు మామూళ్లు ముట్టజెప్పి సీలు వేయించుకుంటారు. దీంతో ఇతర ప్రాంతాల్లో అధికారులు వాహనాన్ని ఆపినప్పుడు బిల్లు చెక్‌ చేసినట్లు ఉండటంతో అంతోఇంతో తీసుకుని వదిలేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి యథేచ్ఛగా గండి పడుతోంది.

నిజాయతీగా పనిచేసే అధికారులకు బెదిరింపులు
తాడిపత్రిలో మైనింగ్‌ మాఫియాకు అడ్డూఅదుపులేకుండా పోతున్న తరుణంలో గతంలో గుత్తి మైనింగ్‌ విజిలెన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌గా ఉన్న ప్రతాపరెడ్డి మైనింగ్‌ మాఫియాపై కొరడా ఝళిపించారు. కేవలం లక్షల్లో ఉన్న ఆదాయన్ని కోట్ల రూపాయలకు చేర్చారు. ఇక తమ ఆటలు సాగవన్న ఆ మాఫీయా తాడిపత్రికి చెందిన ఓ ముఖ్యనేత సహకారం కోరారు. వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చేందుకు ఒప్పందం కుదరడంతో ఏజి ప్రతాప్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి అవినీతి మకిలి అంటించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దీంతో సదరు ముఖ్య నేత మైనింగ్‌ శాఖ మంత్రి వద్ద పంచాయితీ పెట్టి మరీ ఆయనను బదిలీ చేయించారు. ఆ తర్వాత మాఫియా యథేచ్ఛగా తమ దందా సాగిస్తోంది.

లగాన్‌ అంటే..
ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీల నుంచి గుండ్లను తీసుకుని ఫ్యాక్టరీకి సరఫరా చేసి యజమానుల వద్ద రూ.10వేల నుంచి రూ.15వేలు చొప్పున వసూలు చేసే ఈ తతంగాన్ని లగాన్‌గా పిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. 20 మంది సభ్యులు ఈ లగాన్‌ గ్యాంగ్‌లో ఉంటారు. క్వారీ నుంచి ఫ్యాక్టరీకి గుండ్లు చేరే వరకు మార్గమధ్యంలో ఎవరూ అడ్డుకోకుండా చూసుకోవడం వీరి బాధ్యత.

అక్రమ రవాణాను క్వారీల వద్దే అడ్డుకుంటాం
తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీలు ఎక్కడా లేవు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి గుండ్లు వస్తాయి. క్వారీల వద్ద గుండ్ల రవాణాను అడ్డుకుంటున్నాం. ఈ విషయమై క్వారీ యజమానులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే అక్రమంగా గుండ్లను తరలించే లారీలను సీజ్‌ చేసి లక్షల్లో జరిమానా విధించాం. ఇక ముందు కూడా దాడులను ముమ్మరం చేస్తాం.
– వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్‌ ఏడీ

Advertisement
 
Advertisement
 
Advertisement