బ్రేకింగ్‌ : మాజీ ఎంపీ హర్షకుమార్‌ అరెస్టు | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ : మాజీ ఎంపీ హర్షకుమార్‌ అరెస్టు

Published Fri, Dec 13 2019 10:08 PM

Former MP Harsha Kumar Arrested In Rajahmundry In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను, ప్రభుత్వోద్యోగులను బెదిరించిన కేసులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఉన్న రెడ్‌క్రాస్‌ భవనంలోని షాపులను జిల్లా కలెక్టర్, సిబ్బంది కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయిస్తున్నారు. హర్షకుమార్‌ వచ్చి న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించి, మహిళా ఉద్యోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కోర్టు సిబ్బందిని చంపుతానంటూ బెదిరించారని జిల్లా కోర్టు చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హర్షకుమార్‌  శుక్రవారం ఇంటికి రావడంతో పోలీసులు 41 సీఆర్‌పీసీ నోటీసును జారీచేశారు. రాత్రి ఏడు గంటల సమయంలో హర్షకుమార్, ఆయన అనుచరులు స్టేషన్‌కు వచ్చారు. హర్షకుమార్‌ విచారణకు సహకరించక పోవడంతో అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాజమహేంద్రవరం ఐదో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా 14రోజులు రిమాండ్‌ విధించారు. హైకోర్టు బెయిల్‌ ఇవ్వాలని చెప్పినప్పటికీ  అన్యాయంగా అరెస్ట్‌ చేశారని హర్షకుమార్‌ పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement