ఇసుక పేరుతో దోపిడీ | Sakshi
Sakshi News home page

ఇసుక పేరుతో దోపిడీ

Published Mon, Dec 22 2014 1:24 AM

ఇసుక పేరుతో దోపిడీ - Sakshi

సొంత వాహనాల్లో ఇసుక రవాణాకు చెల్లుచీటీ
ప్రభుత్వం గుర్తించిన వాహనాలకే అనుమతి
అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు  
పెరిగిన రవాణా చార్జీలు
ఇప్పటికే ఇసుక ధర పెంపు.. రవాణా పేరుతో మరింత భారం
వీధిన పడనున్న ట్రాక్టర్, లారీల నిర్వాహకులు, కూలీలు

 
కోటబొమ్మాళి, సంతకవిటి:  ఇసుకను ప్రభుత్వం బంగారంగా మార్చేస్తోంది. ఆ పేరుతో నిర్మాణదారులను దోపిడీ చేసి ఖజానా నింపుకోవాలని చూస్తోంది. రీచుల నుంచి ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు అటు సామాన్య వినియోగదారులను, ఇటు ఇసుక రవాణాపైనే ఆధారపడిన  వాహనదారులను షాక్‌కు గురి చేశాయి. ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఇసుక రీచుల్లో అమ్మకాలు, రవాణా దాదాపు నిలిచిపోయాయి.
 
సొంత వాహనాలు చెల్లవు
 

కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం రీచుల నుంచి ఇసుక తరలించేందుకు వినియోగదారులు ఇంతకుముందులా సొంత లేదా తమకు నచ్చిన అద్దె వాహనాలను వినియోగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లోనే.. అదీ ఇసుక ధరతోపాటు రవాణా ఖర్చులను ముందుగానే చెల్లించి ఇసుక తీసుకెళ్లాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించడంతో జిల్లాలోని 13 ఇసుక రీచుల్లో శనివారం నుంచి వాటిని అమలు చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం ఇంతకుముందే ఆయా రీచుల పరిధిలో వాహనాలను గుర్తించి, నమోదు చేసుకుంది.
 
నిబంధనలు ఇవే..
 

ఇసుక రీచుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం ఇ ప్పుడు రవాణాను కూడా వారికే కట్టబెట్టి ంది.  ఇసుక రవాణా చేయదలచుకున్న వారు సంబంధిత వెలుగు కార్యాలయాల్లో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను నమోదు చేయించుకోవాలి.  విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి ఇసుక తరలించేందుకు వచ్చే వాహనాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.  ఇసుక కొనుగోలుదారుల సొంత వాహనాలతో సహా ఇతరత్రా ఏ వాహనాలను రవాణాకు అనుమతించరు.  ఇసుక కావాల్సినవారు ఇసుక ధరతోపాటు వాహనం అద్దెను ముందుగానే మీ సేవ కేంద్రంలో చెల్లించి రసీదు తీసుకొస్తేనే సంబంధిత రీచుల నిర్వాహకులు ఇసుక లోడింగుకు అనుమతిస్తారు. దూరాన్ని బట్టి రవాణా చార్జీలను ప్రభుత్వమే నిర్ణయించింది. దాని ప్రకారం కిలోమీటరు దూరానికి ట్రాక్టర్లకైతే రూ.28, లారీలకు రూ. 44 చొప్పున వసూలు చేస్తారు.
 
కొనుగోలుదారులకు భారం
 
ఈ విధానం ఇసుక కొనుగోలుదారులకు భారంగా పరిణమించడంతోపాటు ఇసుక రవాణానే ఉపాధిగా చేసుకున్న వందలాది ట్రాక్టర్లు, లారీల యజమానుల పొట్టకొట్టనుంది. ఇప్పటివరకు ఇసుక రవాణాకు వాహనదారులతో బేరమాడి నచ్చిన చార్జీ చెల్లించే వెసులుబాటు ఉండేది. తాజా ఉత్తర్వులతో తప్పనిసరిగా నిర్ణీత ధర చెల్లించాల్సిందే. ఫలితంగా కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు విశాఖకు లారీ ఇసుక రవాణా చేయాలంటే ప్రభుత్వ ధర ప్రకారం రూ.12వేలు చెల్లించాలి. ఇదే లారీ ఇసుక ధర రూ.8వేలే. అంటే ఇసుక కంటే రవాణా చార్జీలే తడిసిమోపెడన్నమాట. అలాగే శ్రీకాకుళం మండలం బట్టేరు ర్యాంపు నుంచి టెక్కలికి ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుక తీసుకెళ్లడానికి గతంలో ఇసుక(మూడు క్యూబిక్ మీటర్లు) ధర రూ.2025తో కలుపుకొని మొత్తం రూ.4వేలు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడైతే ఇసుక ధర రూ.2025, రవాణా చార్జీలు రూ.2560, మీ సేవ రుసుము రూ.25 కలిపి మొత్తం రూ. 4610 చెల్లించాల్సిందే.

అంటే గతం కంటే 610 రూపాయలు అదనంగా భరించాల్సి వస్తుంది. దూరాన్ని బట్టి ఇది పెరుగుతుంటుంది. నిబంధనల మార్పు విషయమై జలుమూరు మండలం దొంపాక ఇసుక రీచ్ ఇన్‌చార్జి చిటిబాబు సాహును వివరణ కోర గా శనివారం నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. ఆ మేరకు ఇసుక ధర, రవాణా చార్జీలు కలిపి వినియోగదారుడు మీ సేవలో చెల్లించి రసీదు అందజేస్తేనే ఇసుక సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement