మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూత | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూత

Published Sat, Apr 19 2014 2:48 PM

గీట్ల ముకుందారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ  ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో గత వారం రోజులుగా ఆయన సికింద్రాబాద్‌ యశోధ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా..

గీట్ల ముకుందారెడ్డి  కూనారం గ్రామానికి 1970, 1976లో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1981లో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 1983 నుంచి వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఆయనది. ఇందులో మూడుసార్లు ఆయన గెలిచారు.  జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గీట్ల ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సైతం దాఖలు చేశారు. అధిష్టానం భాను ప్రసాదరావుకు టికెట్ ఇచ్చింది. ముకుందరెడ్డికే టికెట్  లభిస్తుందనే ధీమాతో ఉన్న సీనియర్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం బుజ్జగింపులు, హామీలతో పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు.
 
 అప్పట్లో అందరికీ గీట్ల టార్గెట్

 1983 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులెందరో వచ్చినా వారందరికీ గీట్ల ముకుందరెడ్డే టార్గెట్. 1983లో గోనె ప్రకాశరావుపై ఓడిపోయిన ఆయన తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన గీట్లను స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఢిల్లీకి రప్పించుకుని అభినందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గోనె ప్రకాశరావు, వేముల రమణయ్య, బిరుదు రాజమల్లు, కాల్వ రాంచంద్రారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సి.సత్యనారాయణరెడ్డి, విజయరమణారావు ఇలా అందరికీ ఆయనే ప్రత్యర్థి. 2009లో ఓటమి తర్వాత కొంత కాలంపాటు స్తబ్ధుగా ఉన్నారు.  ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని ఏడాదికాలంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఊరూరా తిరిగి బూత్‌స్థాయి కమిటీలు నియమించారు. ప్రచార బాధ్యతలు కార్యకర్తలకు అప్పగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement