చర్మం మందంగా ఉన్న సీఎం ఉండటం మన ఖర్మ

చర్మం మందంగా ఉన్న సీఎం ఉండటం మన ఖర్మ - Sakshi


చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న ఖర్మ అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలియజేశామని ఆయన తెలిపారు. కేంద్రమంత్రులు, ప్రధానమంత్రిని కలిసేందుకు రెండు రోజుల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్నాథ్ సింగ్ను కలిసిన అనంతరం ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.



కృష్ణా జలాల విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి డ్యాం వద్ద గొడవలు రేపారని, రైతుల ప్రయోజనాలను మంటగలుపుతున్నారని.. ఈ విషయాన్ని రాజ్నాథ్ సింగ్కు చెప్పామని ఆయన అన్నారు. ప్రధాని, రైల్వే మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరామని, రాష్ట్రానికి అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వాళ్లకు వివరిస్తామని అన్నారు. ఇప్పటికే ఢిల్లీకి చాలాసార్లు వచ్చి విజ్ఙప్తులు ఇస్తున్నామని, తమవంతు బాధ్యతగా విభజన చట్టంలోని అంశాలను అమలుచేయాల్సిందిగా కోరతున్నామని తెలిపారు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మరోసారి వచ్చామన్నారు.



ఆయన ఇంకా ఏమన్నారంటే...

* రైల్వేలకు సంబంధించి కొత్త జోన్ ఏర్పాటు, ఇతర అంశాలపై కోరాం.

 

* మాకు సంబంధించిన అంశం పూర్తిగా కాకపోయినా, నాలుగు అడుగులు ముందుకేసి మా ధర్మంగా ఇక్కడికొచ్చి కోరుతున్నాం.

* ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తారన్నది చంద్రబాబు నాయుడిని అడగాలి.

* చంద్రబాబు నాయుడు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటేసి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు.

* చట్టంలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని కూడా చేర్చలేదు. అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు.

* అప్పుడు మొత్తుకుని చెప్పినా, ఎవరూ వినిపించుకోలేదు. మొదటి ఓటు తామే వేశామని చంద్రబాబు అన్నారు.

* తనకు రాజకీయ ప్రయోజనం చేకూరాలన్న ఒకే ఒక దృక్పథంతో వరంగల్లోకూడా రాష్ట్రాన్ని తామే విడగొట్టామని చెప్పారు.

* బీజేపీ కూడా అరాచకంగా వ్యవహరించింది. రెండు రోజులు ఆగి, ఈ విషయాలను చట్టంలో పెట్టి ఉంటే ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదు.

* ఇప్పుడు చట్టంలో లేదు కాబట్టి ఏ మేరకు న్యాయం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం.

* చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న ఖర్మ

ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top