గొంతులు లేస్తున్నాయి.. | Sakshi
Sakshi News home page

గొంతులు లేస్తున్నాయి..

Published Tue, May 26 2015 12:27 PM

గొంతులు లేస్తున్నాయి.. - Sakshi

హైదరాబాద్ : ఎన్నిలకప్పుడు పొత్తులు పెట్టుకున్న టీడీపీ, బీజేపీల మధ్య చిత్రమైన వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ స్వరం మారుతోంది. మొన్న సోము వీర్రాజు, నిన్న మురళీధరరావు, ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ...టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలకు బీజేపీని దోషిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు మండిపడుతున్నారు. ఏపీ రాజధానికి భూ సేకరణతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు.  

రైతులను మెప్పించి భూములు తీసుకోవాలనే కానీ, బలవంతంగా భూములు సేకరించకూడదని బీజేపీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ మురళీధరావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.   రైతుల కన్నీళ్లపైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయడాన్ని భారతీయ జనతాపార్టీ ఎంతమాత్రం సమర్థించదని ఆయన అన్నారు. రాజధానిని నిర్మించుకోవడం ముఖ్యమైన అంశమే అయినప్పటికీ రైతులను మెప్పించే వారి భూములను తీసుకోవాలని మురళీధరరావు చెన్నైలో మీడియాతో వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు.  అధికారంలోకి రాకముందు, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను  చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తర్వాత అమలు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కన్నా మండిపడ్డారు.

రాష్ట్రంపై అంత ప్రేమ ఉంటే...చట్టంలో  ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాల్సిందేనని అప్పుడే  ఎందుకు అడగలేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాకినాడ వచ్చిన కన్నా...తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదన్న కన్నా.....ఆ హామీ యూపీఏ సర్కార్ ఇచ్చిందని గుర్తు చేశారు. కాగా  ఏపీ రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటే సహించేది లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement