భూముల స్వాధీనం అనంతరం రాజధాని నిర్మాణం | Sakshi
Sakshi News home page

భూముల స్వాధీనం అనంతరం రాజధాని నిర్మాణం

Published Sat, Apr 18 2015 4:48 AM

భూముల స్వాధీనం అనంతరం  రాజధాని నిర్మాణం

రాష్ట్ర మంత్రులు పుల్లారావు, నారాయణ వెల్లడి
రాయపూడి, తుళ్లూరులో భూముల చదును
రైతులకు కౌలు డీడీల పంపిణీ
 

తాడికొండ (గుంటూరు) : రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల స్వాధీనం ప్రక్రియ పూర్తికాగానే రాజధాని నిర్మాణానికి చర్యలు చేపడతామని వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తుళ్లూరు మండలం రాయపూడి సీఆర్‌డీఏ కార్యాలయంలో రైతులకు కౌలు డీడీలను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు 4 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ కింద రూ.64 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. మరో రూ.169 కోట్లు రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీగా జమచేయనున్నామని చెప్పారు. నెలాఖరులోగా భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు.

రాజధాని అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ నాయకులను తీసుకువచ్చినా, మేథాపాట్కర్ పర్యటించినా ఒరిగేదేమీ లేదని చెప్పారు. రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విశ్వాసంతో భూములిచ్చారన్నారు. రాజధానికి భూములు ఇవ్వనివారు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఆయా రైతులకు పంటకు మాత్రమే అవకాశం కల్పించిందని చెప్పారు. పట్టిసీమను అడ్డుకోటానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ చేస్తున్న ప్రయత్నాలు వృథా అన్నారు.  పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ సోమవారానికి రైతు రుణమాఫీ 95 శాతం పూర్తవుతుందన్నారు. గ్రామ కంఠాల విషయంలో కూడా నెలాఖరులోగా రైతులకు అనుకూలంగా చేస్తామని చెప్పారు.

మంగళగిరి మండలంలోని నీరుకొండ, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో 50 ట్రాక్టర్లతో శనివారం భూముల చదును చేయనున్నామని వివరించారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, జేసీ చెరుకూరి శ్రీధర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం రాయపూడిలో కొమ్మినేని రాధాకృష్ణ పొలాన్ని, తుళ్లూరులో అప్పారావు పొలాలను మంత్రులు ట్రాక్టర్లతో చదునుచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement