వీరంపాలెంలో లోక కల్యాణార్థం 23 రోజుల యాగం ప్రారంభం


ఢమరుక నాదం లయ విన్యాసం చేసింది.. నాగ వాద్యం పల్లవించింది.. త్రిశూలాలు తళతళ మెరిశాయి. నాగసాధువుల రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం పంచాయతన క్షేత్రంలో శ్రీనవకుండాత్మక శతసహస్ర మహాచండీ అహోరాత్ర యాగం శుక్రవారం అట్టహాసంగా మొదలైంది. 552 గంటలపాటు (23 రోజులు) నిర్విరామంగా సాగించే ఈ క్రతువుకు 15 మంది హిమాలయ నాగసాధువులు, 24 మంది ఉపాసకులు, 89 మంది దీక్షధారులు తరలివచ్చారు. యాగంలో 12,500 కేజీల ఆవునెయ్యి, టన్ను పసుపు, 6 టన్నుల కుంకుమ, 4 టన్నుల పువ్వులు, 230 టన్నుల యజ్ఞ సమిధలు వాడుతున్నారు.

 

 వీరంపాలెం (తాడేపల్లిగూడెం), న్యూస్‌లైన్ : హరహర మహదేవా శంభో శంకర.. ఓం నమశ్శివాయ.. నామస్మరణలతో తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం మార్మోగింది. త్రిశూల ధారులై హిమపర్వతాలలో ఆదిదేవుని కోసం తపమాచరించే ఆత్మానంద నాగబాబాలు డమరుక నాదం చేశారు. శ్రీభారతీయ వేదవిజ్ఞాన ధర్మసేవా పరిషత్ ఆధ్వర్యంలో వీరంపాలెంలోని శ్రీ బాలాత్రిపురసుందరి విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో శుక్రవారం నవకుండాత్మక శతసహస్ర మహాచండీ అహోరాత్ర యాగం వైభవంగా ప్రారంభమైంది. 552 గంటల పాటు (23 రోజులు) నిర్విరామంగా జరిపే యూగాన్ని గాయత్రీ పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ప్రారంభించారు. లోక కల్యాణం, ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టిన ఈ మహాక్రతువుకు హెటెరో గ్రూప్ చైర్మన్ బండి పార్థసారధిరెడ్డి, కళావతి దంపతులు కలశస్థాపన చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్త బృందాలు 108 కలశాలతో, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. 

 

 గోవులు, దివ్యయోగులు వెంట రాగా శోభాయాత్ర కనుల పండువగా సాగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 9.51 గంటలకు యజ్ఞశాల ప్రవేశం చేశారు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు హంసవాహనంపై త్రిముఖ రూపంలో బ్రాహ్మి మహాదేవిగా ఉన్న అమ్మవారితో పాటు సప్తమాతృకలకు, దశమహవిద్యలకు, నవదుర్గలకు, యోగ, ముద్ర తదితర ఉపాసనలతో విశేష అర్చనలు నిర్వహించారు. 108 శ్రీ చక్రాల వద్ద మహిళలు లలితా సహస్రపారాయణం చేస్తుండగా మహాచండీ యాగాన్ని ప్రారంభించారు. 64 యోగిని స్తంభాలకు విశేష పూజలు, 12 హోమకుండాలలో సంపూర్ణ చండీహోమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు  కొవ్వూరి గాంధీరెడ్డి జ్ఞాపకార్థం ఆయన అల్లుడు బి.నాగిరెడ్డి దంపతులు అన్నసమారాధన చేశారు. ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తదితర ప్రముఖులు క్షేత్రాన్ని సందర్శించారు. 

 

 యజ్ఞంతో శాంతి చేకూరుతుంది : స్వరూపానంద స్వామి

 శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ రాష్ట్రం అతలాకుతలంగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ యజ్ఞం అద్భుత కార్యక్రమమన్నారు. ఇటువంటి యాగం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవన్నారు. యజ్ఞంతో శాంతి చేకూరుతుందని చెప్పారు. ఇంతటి మహాక్రతువును అమ్మవారి సుకృతం వల్లే చేయగలుగుతున్నానని యాగ నిర్వాహకులు గరిమెళ్ల వెంకట రమణశాస్త్రి అన్నారు. అమ్మ సంక ల్పంతో పీఠాధిపతులు గ్రామానికి వచ్చినట్లు చెప్పారు. 

 

 అహోరాత్రమంటే.. 

 అహోరాత్రమంటే రాత్రి, పగలు చేసే యజ్ఞం, మహాచండీయాగమని రుత్వికులు తెలిపారు. ఇటీవల ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో అతిరాత్ర యాగాలు జరిగాయి. ఇవి కేరళ సంప్రదాయ బద్ధంగా సాగే క్రతువులు.  1128 సంపూర్ణ చండీయాగాలు, లక్ష లలితా సహస్ర పారాయణలు, 108 శ్రీచక్రాలకు కోటి కుంకుమార్చన, లక్షబాలానవాక్ష రీ మూల మంత్ర పఠనం ఈ యాగంలో భాగంగా ఉంటాయి. 24 గంటలలో 12 గంటల పాటు యాగం ఉంటుంది. మిగిలిన 12 గంటలలో లలితా సహస్రం, కుంకుమార్చన, ఇతర పూజలు చేస్తారు. 

 

 లోక కల్యాణం కోసమే మా తపస్సు

 తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ‘సమాజం ఆరోగ్యంగా ఉండాలి. దేశం సుభిక్షంగా ఉండాలి. లోకకల్యాణం జరగాలి. అందుకోసమే హిమాలయూల్లో మేం తపం ఆచరిస్తాం’ అని చెప్పారు ఆత్మానంద నాగబాబాలు. పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంలో నిర్వహిస్తున్న అహోరాత్ర యూగంలో పాల్గొనేందుకు వచ్చిన నాగ సాధువులను శుక్రవారం ‘న్యూస్‌లైన్’ పలకరించింది. 15 మందితో కూడిన నాగసాధువుల బృందానికి హేమగిరి తానాపతి, మహంత్ సంతోష్‌పూరి, రమేష్‌గిరి కారోవరి నాయకత్వం వహిస్తున్నారు. వీరిలో హనుమాన్‌పూజారి సదానంద్ గిరి, దత్తపూజారి, సురేంద్రగిరి,మహంత్ రాంచరణ్‌గిరి, భండారి, రత్నానంద్, నాగబాబా దశమగిరి, ఘనశ్యాం గిరి, రఘు నందన్‌గిరి, శ్యాంగిరి ఉన్నారు.  వీరంతా హిందీతోపాటు ఆంగ్ల భాషలో కూడా అనర్గళంగా మాట్లాడటం విశేషం. 

 

 బృందంలో ఒకరైన పూజారి సదానందగిరి మాట్లాడుతూ ‘దేశంలో అశాంతి ప్రబలింది. అత్యాచారాలు పెరిగాయి. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితులు చక్కబడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ప్రజలు సుఖంగా, ప్రాంతాలు సమృద్ధిగా విలసిల్లాలి. దానికి భగవంతుని అనుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహం కోసం హిమాలయాల్లో ఎక్కువ కాలం తపస్సు చేస్తుంటాం’ అని చెప్పారు. ‘విపరీతంగా మంచుకురిసే వేళల్లో హిమపర్వత శ్రేణులకు వెళతాం. అక్కడ తపమాచరించే సమయంలో ధుని వెలిగించి, దానిలో వచ్చే విబూతిని తనువులకు రాసుకుంటాం. తపస్సు ముగిశాక, వారణాసి క్షేత్రానికి చేరుకుంటాం. అక్కడి శ్రీ పంచ్‌దస్‌నామ్ జూనాఘడా బడా హనుమాన్ ఘాట్‌లో ఉంటాం. 

 

 ఈ ఘాట్‌లో రెండు లక్షల మంది నాగసాధువులు ఉంటారు. వారణాసిలో 10 లక్షల మంది నాగసాధువులు ఉన్నారు. కుంభమేళా జరిగే అలహాబాద్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ వెళుతుంటాం. కుంభమేళాలకు కాకుండా బయటకు, అదీ దక్షిణ భారతదేశానికి రావడం ఇదే ప్రథమం’ అని వివరించారు. ఇక్కడి ప్రజల్లో ఆధ్యాత్మిక భావం అధికంగా ఉందని, సాధువులను భగవంతుడిగా పూజిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతానికి తొలిసారిగా రావడం ఆనందంగా ఉందన్నారు. కాశీలో మాదిరి వీరంపాలెం పీఠం ధర్మప్రచారం చేస్తోందన్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top