‘బాబు’కు అంత దమ్ముందా? | Sakshi
Sakshi News home page

‘బాబు’కు అంత దమ్ముందా?

Published Sun, Apr 20 2014 2:41 AM

‘బాబు’కు అంత దమ్ముందా? - Sakshi

  • అవసరం.. అధికారం కోసమే బీజేపీతో పొత్తు
  •   రైతు రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పాలి?
  •   ప్రధాని అభ్యర్థి మోడీతో ప్రకటన చేయిస్తారా?
  •   బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిస్తారా...?
  •   జగన్‌పై ప్రజల్లో పెరిగిన విశ్వాసం
  •   వైఎస్సార్‌సీపీ బందరు లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ  
  •  సాక్షి ప్రతినిధి, విజయవాడ :  వైఎస్ పాలన నాటి స్వర్ణయుగాన్ని తెస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా ప్రకటించారని, మరి చంద్రబాబుకు తన తొమ్మిదేళ్ల పాలన తెస్తానని చెప్పే దమ్ముదా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానుల నడుమ ఆయన మచిలీపట్నంలో శనివారం లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

    సారథి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఇప్పుడు ఆయన చేస్తున్న బూటకపు హామీలను నమ్మడంలేదన్నారు.  ఏనాడు రైతు గురించి, వ్యవసాయం గురించి పట్టించుకోని చంద్రబాబు అధికారం కోసం ఆల్‌ఫ్రీ హామీలిస్తున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు  అధికారం కోసం అవకాశవాదంగా ఇచ్చే హామీలపై జనానికి నమ్మకం లేదని అన్నారు. మత తత్వ బీజేపీతో జట్టు కట్టి చారిత్రక తప్పిదం చేశానని, మళ్లీ అటువంటి తప్పిదం చేయనని గతంలో చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తులేవా? అని సారథి ప్రశ్నించారు. అటువంటి బీజేపీతో ఏ మోహం పెట్టుకుని మళ్లీ పొత్తు పెట్టుకున్నారని అడిగారు.
     
    బీజేపీ మేనిఫెస్టోలో పెట్టమనండి..
     
    అధికారం కోసం.. అవకాశం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడనే సంగతి అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. చంద్రబాబు ప్రకటించిన రైతు రుణమాఫీకి రూ.1.27లక్షల కోట్లు అవుతుందని, దాన్ని ఎలా అమలు చేస్తారనే దానిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారా? అనేది స్పష్టత లేదని అన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేస్తామంటే మోడీతో దాన్ని ప్రకటించి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు.

    రైతు రుణమాఫీ పాలసీని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అది పరిమితం కాదని, మిగిలిన రాష్ట్రాలన్నింటికీ వర్తింపజేయాల్సి ఉంటుందని అన్నారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం సైతం రైతు రుణమాఫీ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం కష్టమేనని తెలిపారు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇస్తే కొత్త రాష్ట్ర ఏడాది బడ్జెట్ కూడా దానికి సరిపోదని చెప్పారు.
     
    బాబు పాలనలో గ్రామాలు వలస..

    సీమాంధ్రను సింగపూరు చేస్తానని చెబుతున్నా చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏదో ఒక హైటెక్ సిటీ కడితే అభివృద్ధా? అని మాజీ మంత్రి సారథి ప్రశ్నించారు. హైదరాబాద్‌కు బిల్‌క్లింటన్‌ను తీసుకొచ్చినట్టు డబ్బాలు కొట్టుకుంటున్న బాబు ఆయన హయాంలో గ్రామాలకు గ్రామాలే పొట్టచేతబట్టుకుని వలస పోయిన సంగతి మరచిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మేస్థితి లేదన్నారు.
     
    రైతులకు జగన్ భరోసా..
     
    అభివృద్ధితోపాటు సంక్షేమానికీ పెద్ద పీట వేస్తానని చెబుతున్న పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహనరెడ్డిని ప్రజలు విశ్వసిస్తున్నారని మాజీ మంత్రి సారథి అన్నారు. రైతులకు భరోసా ఇచ్చేలా మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని చెప్పారు. రైతుకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉంటుందని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొంత ఊరటనిచ్చేలా ధర కల్పించేందకు స్థిరీకరణ నిధి ఉపయోగపడుతుందని సారథి అన్నారు. జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన ఐదు సంతకాలు ఈ రాష్ట్ర భవితను, దిశ దశను మార్చనున్నాయని ఆయన అన్నారు.
     
    సమన్వయంతో జిల్లా పురోగతి సాధిస్తాం..

    జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని సారథి అన్నారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజాభిమానంతో గెలిచి ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు. జిల్లాలో కీలకమైన బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం. రోల్డ్‌గోల్డ్ పరిశ్రమ, కళంకారి పరిశ్రమ, కొండపల్లి బొమ్మలు ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తామన్నారు. జిల్లాను టూరిజంలోనూ, వ్యవసాయ, ఆక్వా రంగాల్లోనూప్రత్యేక కృషి చేసి అభివృద్ధి చేస్తామని సారథి భరోసా ఇచ్చారు. మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని నాని, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, దుట్టా రామచంద్రరావు పాల్గొన్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement