రాష్ట్ర విభజనను నిరసిస్తూ అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరమన్నారు. ఎవరిని అడిగి విభజించారని సబ్బం హరి ఈ సందర్భంగా ప్రశ్నించారు. సోనియా గాంధీ నియంతలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తన రాజీనామాను కాంగ్రెస్ ఎప్పుడైనా ఆమోదించుకోవచ్చని సబ్బం హరి అన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి అభ్యంతరం తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ.... తెలంగాణ అంశంపై సిద్దాంతాలను గాలి కొదిలేసిందని ఆయన మండిపడ్డారు. రాజీనామాలు చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఉద్యమాల్లోకి రావాలని సబ్బం హరి పిలుపు నిచ్చారు. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు.