గొల్ల బాబూరావు
సాక్షి విశాఖపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఉత్తరాంధ్ర పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైతే అందులో రెండు ఉత్తరాంధ్రకే అవకాశం కల్పించారు. వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైవీ సుబ్బారెడ్డి..
వైవీ సుబ్బారెడ్డిది ప్రకాశం జిల్లా మేదరమెట్ల. తల్లిదండ్రులు ఎర్రం చిన్నపోలిరెడ్డి, పిచ్చమ్మ. షోలాపూర్‌లో భారతీ విద్యాపీఠ్‌్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఎ(మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పూర్తి చేసారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి 16వ లోక్‌సభలో అడుగుపెట్టారు. పరిశ్రమల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, ప్రైవేట్ బిల్లుల, తీర్మానాల కమిటీలో సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకాల(ఎంపీ ల్యాడ్స్) కమిటీ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కాన్సులేటివ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యేక హోదా కోసం 2018లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్పీకరించారు. వైఎస్సార్ సీపీలోనూ పలు పదవులు నిర్వర్తించారు. గతంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.
విశ్వసనీయతకు గుర్తింపు
విధేయత, విశ్వసనీయతకు గుర్తింపుగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. గ్రూప్–1 అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన బాబూరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాయకరావుపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అక్కడ ముప్‌పై ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు వేశారు. కొద్ది నెలలకే వైఎస్సార్ దుర్మరణం పాలవ్వడంతో తదనంతర పరిణామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీని స్థాపించారు. జిల్లాలో బాబూరావు ఒక్కరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
వై.వి.సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావుకు
అవకాశం
Comments
Please login to add a commentAdd a comment