పశువుల బీమా.. రైతుకేది ధీమా! | Sakshi
Sakshi News home page

పశువుల బీమా.. రైతుకేది ధీమా!

Published Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

దౌల్తాబాద్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పథకాల అమలుతో పలువురు రైతులు లబ్ధి పొందుతున్నారు. కానీ కొన్నేళ్లుగా పాత పథకాలు మాత్రం నిర్వీర్యం అవుతున్నాయి. అందులో భాగంగా గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలపై సబ్సిడీపై ఎత్తివేయడంతో పాటు పాడి పశువులకు బీమా పథకం నిలిపివేసింది. దీంతో పాడి రైతులు గొర్లు, మేకల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీమా నిలిపివేతతో మూగజీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా కష్టజీవులకు భారంగా మారింది.

ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది

గతంలో పశువుల బీమా పథకంలో భాగంగా ఇన్యూరెన్స్‌ ప్రీమియం డబ్బులను సగం రైతులు, మరో సగం ప్రభుత్వం చెల్లించేది. దీంతో రైతులకు కొంత ఊరట ఉండేది. గేదెలు, ఆవులకు మూడేళ్లకు సరిపడా ఇన్యూరెన్స్‌ ప్రీమియం రూ.4వేలు ఉండగా ప్రభుత్వం రూ.రెండు వేలు చెల్లించేది. ఈ మూడేళ్ల కాలంలో పాడిరైతుకు చెందిన పశువులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వాటి రకాన్ని బట్టి రూ.40వేల నుంచి రూ.8వేల వరకు ఇన్యూరెన్స్‌ నగదు వచ్చేది. ప్రస్తుతం రైతులు ఈ అవకాశాన్ని పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు. దాదాపు మూడు వేల కుటుంబాల పశు పోషణ, గొర్ల, మేకల పెంపకందారులు బీమా నగదు నోచుకోక ఇబ్బంది పడుతున్నారు.

ఎప్పటిలాగే కొనసాగించాలి

గత ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురుమల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పథకంలో భాగంగా గొర్లకు ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. కానీ ప్రభుత్వం ఒక ఏడాదికి సంబంధించిన ప్రీమియం మాత్రమే చెల్లించింది. గడువు ముగిసిన తర్వాత గొర్లు చనిపోతే బీమా వర్తించని కారణంగా పెంపకందార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన గొర్రెలతో పాటు గేదెలు, ఎద్దులు, ఆవులకు సైతం ఎప్పటిలాగే 50శాతం నిధులను కెటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై దౌల్తాబాద్‌ పశువైద్య సహాయకుడు సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా.. పశువులకు సబ్సిడీ లేదు. ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఏడేళ్లుగా నిలిచిన ఇన్యూరెన్స్‌ పథకం

నష్టపోతున్న పాడిరైతులు

పట్టించుకోని అధికార యంత్రాంగం

Advertisement
 
Advertisement
 
Advertisement