ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయేందుకు కేసీఆర్‌ ప్లాన్‌  | Sakshi
Sakshi News home page

ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ 

Published Tue, Aug 15 2023 3:11 AM

TPCC president Revanth Reddy comment on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట­మి ఖాయమని సర్వేలు చెప్తున్నాయని, అందుకే ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోయేందుకు సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టడానికి స్థలం లే­దం­టున్న సీఎం కేసీఆర్‌.. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా అమ్ముతున్నారని నిలదీశా­రు.

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అలంపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు చెంది­న పలు పార్టీల నేతలు సోమవారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పా­ర్టీ పేదలకు పట్టా భూములిస్తే.. బీఆర్‌ఎస్‌ సర్కా­రు అభివృద్ధి ముసుగులో వాటిని గుంజుకోవాలని చూ­స్తోందని ఆరోపించారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రజల ఆకాంక్షల కో­స­మని.. అంతేతప్ప ఔటర్‌ రింగురోడ్డును, దళితుల భూ­ములను అమ్ముకునేందుకు కాదని పేర్కొన్నారు. 

వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి.. 
ఓటమి భయంతోనే కేసీఆర్‌ రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారని, పనులు చక్కబెట్టుకుంటున్నారని రేవంత్‌ ఆరోపించారు. భూములు కొనేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్‌ తన సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్‌షాపుల టెండర్లను నాలుగు నెలల ముందు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు 
పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని రేవంత్‌ పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు బీఆర్‌ఎస్‌ నేతలకు తొత్తుల్లా పనిచేస్తూ.. కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement