ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యసయోధ్య! | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యసయోధ్య!

Published Thu, Aug 24 2023 1:43 AM

NHAI and State Government conciliation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగురోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి పరిహార మొత్తంలో రాష్ట్రప్రభుత్వం తన వంతు సగం వాటా డబ్బులు డిపాజిట్‌ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ లేఖ రాయటంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఒకేసారి తన వాటా మొత్తం కాకుండా, అవార్డులు పాస్‌ చేసిన కొద్దీ విడతల వారీగా వాటా చెల్లిస్తానంటూ తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించింది. దీంతో భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది.

వారం రోజుల్లో అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్‌హెచ్‌ఏఐ ప్రారంభించబోతోంది. త్వరలోనే భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా పరిహారం పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో రీజనల్‌ రింగురోడ్డు పనులు ప్రారంభించేందుకు వీలుగా టెండర్లు పిలిచేందుకు అవకాశం కలగనుంది.
 
రూ.100 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ప్రధాన గెజిట్లు జారీ అయిన విషయం తెలిసిందే. భూ పరిహారం పంపిణీకి సంబంధించిన 3డీ గెజిట్‌ నోటిఫికేషన్లు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే వివరాలు గల్లంతైన భూములకు సంబంధించి మాత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. 3డీ గెజిట్లు విడుదలైన భూములకు సంబంధించి పట్టాదారులకు పరిహారం అందజేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర కార్యాలయం అనుమతి మంజూరు చేయటంతో స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

162 కి.మీ. ఉత్తర భాగానికి సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లు అవసరమవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ బడ్జెట్‌లో ఖరారు చేసింది. ఈ మొత్తంలో 50 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి. అంటే రూ.2,585 కోట్లు, స్తంభాల వంటి వాటి తరలింపునకు అయ్యే వ్యయానికి సంబంధించి మరో రూ.363.43 కోట్లు.. మొత్తం 2,948.43 కోట్లు చెల్లించాలంటూ ఎన్‌హెచ్‌ఏఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే అవార్డ్‌ పాస్‌ చేసే 3డీ గెజిట్లు కూడా విడుదల కాకుండానే పరిహారం జమ చేయాలనటం సరికాదంటూ ప్రభుత్వం నిరాకరించింది.

దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ మూడు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత అధికారులు చర్చించటంతో సయోధ్య కుదిరింది. ఇందులో భాగంగా తొలుత రూ.100 కోట్లు డిపాజిట్‌ చేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించే ప్రాంతాలకు అవార్డులు పాస్‌ చేసినప్పుడల్లా తన వాటా చెల్లిస్తాననడంతో ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించింది. తాజాగా 8 కాలాలకు సంబంధించి 3డీ గెజిట్లు విడుదల కావటంతో పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.

యాజమాన్య పత్రాలు అందజేయాల్సిందిగా ఆదేశం.. 
ఏయే ప్రాంతాల్లో పరిహారం పంపిణీ చేయాలో గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా, సంబంధిత భూముల యజమానులు వారేనని రూఢీ చేసే ఆధారాలు సమర్పించాల్సిందిగా పట్టాదారులకు సమాచారం పంపింది. వాటితోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా కోరింది. డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేశాక, రికార్డులతో సరిచూసుకుని పరిహారాన్ని డిపాజిట్‌ చేయనున్నారు. పూర్తి వివరాలు సిద్ధమయ్యాక కాలాల వారీగా పత్రికాముఖంగా ప్రకటనలను కూడా వెల్లడించనుంది.  

భూములకు.. నిర్మాణాలకు.. చెట్లకు.. 
పట్టాదారుల భూములు, వాటిల్లో ఉన్న నిర్మా ణాలు, తోటలు, విలువైన చెట్లకు లెక్కకట్టి పరిహారం ఇస్తారు. ఆ ప్రాంతంలో మూడేళ్ల రిజి్రస్టేషన్ల విలువలను గుర్తించి వాటి సరాసరి లెక్కగట్టి.. దానికి మూడు రెట్లను గుణించి పరిహారంగా ఖాయం చేయనున్నారు. ఆస్తులు, చెట్లకు వాటి విలువ ఆధారంగా లెక్కగడతారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement