బస్సులో బల్మూరి.. ఆటోలో కౌశిక్‌ | Sakshi
Sakshi News home page

బస్సులో బల్మూరి.. ఆటోలో కౌశిక్‌

Published Fri, Feb 9 2024 2:21 AM

MLA Padi Kaushik Reddy Travel by Auto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు వినూత్న రీతిలో అసెంబ్లీకి రావడం ఆసక్తిని కలిగించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్నే ఈ ఇద్దరు ఎంచుకోవడం విశేషం. ఇటీవలే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన బల్మూరి వెంకట్‌ నాంపల్లిలో ఆర్టీసీ బస్‌ ఎక్కి అసెంబ్లీ గేట్‌ వరకు వచ్చారు. ఈ సందర్బంగా బస్‌లో మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఉచిత ప్రయాణం అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్‌ రెడ్డి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ఆటోలో అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారు. అయితే ఆటోకు పాస్‌ లేకపోవడంతో పోలీసు అధికారులు ఆటోను అసెంబ్లీలోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఆటో దిగి కాలినడకన అసెంబ్లీలోకి వచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ తగ్గి ఇప్పటివరకు 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, సుమారు ఆరు లక్షల ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement