ప్రొసీజర్‌ ప్రకారమే... | Sakshi
Sakshi News home page

ప్రొసీజర్‌ ప్రకారమే...

Published Fri, Feb 9 2024 12:46 AM

CM Revanth Reddy in chit chat with media in Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని కేటాయించలేమని హైకోర్టు పేర్కొందని, రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవాలని సూచించిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనిపై మంత్రివర్గంలోగానీ, అసెంబ్లీలోగానీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే కులగణనపై తీర్మానం ఉంటుందన్నారు. గురువారం అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగం అనంతరం రేవంత్‌ తన చాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

‘‘కాళేశ్వరం విషయంలో సరైన దిశలోనే ముందుకు వెళ్తున్నాం. దేనికైనా ఓ ప్రోసీజర్‌ ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఒక ప్రొసీజర్‌ ప్రకారం పనిచేస్తోంది. పాకిస్తాన్‌ ఉగ్రవాది కసబ్‌కు ఉరి అమలు కూడా ఓ ప్రొసీజర్‌ ప్రకారమే జరిగింది. మిషన్‌ భగీరథలో అక్రమాలపైనా విచారణకు ఆదేశించాం. టీఎస్‌పీఎస్సీ విషయంలోనూ పక్కా ప్రొసీజర్‌తో వెళుతున్నాం. భవిష్యత్‌లో నిరుద్యోగులకు ఇబ్బందులు ఎదురవకుండా నియామకాల విషయంలో స్పష్టతతో వ్యవహరిస్తున్నాం. విధానపరమైన లోపాలు చోటుచేసుకోకుండా పాలన సాగిస్తాం..’’ అని రేవంత్‌ తెలిపారు.  

కేసీఆర్‌ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది! 
అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేక పోతున్నారని, అసహనంతో మాట్లాడుతున్నారని రేవంత్‌ విమర్శించారు. కానీ కేసీఆర్, బీఆర్‌ఎస్‌ల గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్‌ బేషరం మనిషి.. కేసీఆర్‌ ఓ ఎక్స్‌పైరీ మెడిసిన్‌. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి హాజరుకాలేదు. సభలో చర్చించాల్సిన అంశాలపై ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశానికి రాలేదు. అంటే ప్రతిపక్ష నేత ఏమిటో, ఆయన చిత్తశుద్ధి ఏమిటో, ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే రాలేదు. తర్వాతైనా వస్తారా లేదా..’’అని రేవంత్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ రావాలని, ప్రతిపక్షనేతగా బాధ్యతలను నిర్వర్తించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. 

హరీశ్‌రావుది అవగాహన రాహిత్యం 
బీఏసీ సమావేశంలో తాము హరీశ్‌రావును అడ్డుకోవడం ఏమిటని రేవంత్‌ పేర్కొన్నారు. పదేళ్లు శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసినా కూడా హరీశ్‌రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. అసెంబ్లీ స్పీకర్‌ తీసుకునే నిర్ణయానికి మమ్మల్ని బాధ్యుల్ని చేస్తామంటే ఎలాగని నిలదీశారు. బీఏసీ భేటీకి హాజరయ్యేందుకు కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లను బీఆర్‌ఎస్‌ ఇచ్చిందని.. వారు కాకుండా వేరేవారిని సమావేశానికి అనుమతించాలా, లేదా అనేది స్పీకర్‌ నిర్ణయమని స్పష్టం చేశారు.

వివిధ అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సమావేశాలను స్పీకర్‌ పొడిగించవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మనవడు హిమాన్షు కూడా బీఏసీ భేటీకి వస్తానంటే కుదురుతుందా? అని ప్రశ్నించారు. తన వద్దకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే కాదు కేసీఆర్‌ వచ్చినా కలుస్తానని చెప్పారు. గతంలో తాను కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి కలసినప్పుడు జరగని చర్చ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి తనను కలిస్తే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. 

చాంబర్‌ కేటాయింపు స్పీకర్‌ నిర్ణయం.. 
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు చాంబర్‌ కేటాయింపు, బీఆర్‌ఎస్‌ కార్యాలయం మార్పు అనేవి స్పీకర్‌ నిర్ణయానికి అనుగుణంగా జరుగుతాయని రేవంత్‌ చెప్పారు. ‘‘చాంబర్‌ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. కానీ ఇక్కడే ఇవ్వాలి.. అక్కడ ఇవ్వద్దు అనేవేమీ ఉండదు కదా!’’అని పేర్కొన్నారు. ఇప్పటికైతే నాలుగు రోజులు సభను నిర్వహించాలని అనుకున్నామని.. దీనిపై స్పీకర్‌ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. సంబంధిత శాఖ మంత్రి ఆ వివరాలు చెప్తారని రేవంత్‌ బదులిచ్చారు.

మేడిగడ్డపై చర్చను పక్కదారి పట్టించేందుకు కృష్ణాబోర్డు అంశాన్ని కేసీఆర్‌ ముందుకు తెస్తున్నారని విమర్శించారు. ఏపీ నాగార్జునసాగర్‌పైకి పోలీసులను పంపి లాక్కునే ప్రయత్నం చేస్తే కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్‌ అన్నారంటే.. ఆయనకున్న నిబద్ధత ఏమిటో ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. కృష్ణాబేసిన్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు వచి్చన అసెంబ్లీ సీట్లను చూస్తే ఇది స్పష్టమవుతుందన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమందిని పోటీకి దింపాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement