Sakshi News home page

మనోళ్ల కోచ్‌.. వరల్డ్‌ నంబర్‌ 1: తాప్సితో ప్రేమ.. మథియస్‌ బ్యాగ్రౌండ్‌ ఇదే!

Published Wed, Feb 28 2024 4:32 PM

Who Is Mathias Boe Know About Taapsee Pannu To Be Husband - Sakshi

ప్రేమకు సరిహద్దులు ఉండవు.. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే పరిచయాన్ని పరిణయం దాకా తీసుకువెళ్లడమే తరువాయి అన్నట్లు.. ఇప్పటికే ఎన్నో సెలబ్రిటీ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. తాప్సి పన్ను- మథియస్‌ బో కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఉదయ్‌పూర్‌ వేదికగా ఈ లవ్‌ బర్డ్స్‌ మార్చిలో ఏడడుగులు వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను బాలీవుడ్‌లో పింక్‌, థప్పడ్‌ వంటి సినిమాలో నటిగా తనను తాను నిరూపించుకుంది. ఇటీవల షారుఖ్‌ ఖాన్‌తో కలిసి డంకీ సినిమాలో కనిపించింది ఈ ఢిల్లీ సుందరి.

ఎల్లలు దాటిన ప్రేమ
హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే తాప్సి.. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోతో ప్రేమలో పడింది. 2014లో బో ఇండియా ఓపెన్‌ ఆడేందుకు వచ్చినపుడు స్టాండ్స్‌లో కూర్చుని అతడిని చీర్‌ చేసింది తాప్సి.

అప్పటికే వీరి బంధం గురించి గుసగుసలు వినిపించగా.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సాధించిన విజయాలను పరస్పరం సెలబ్రేట్‌ చేసుకుంటూ తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారీ సెలబ్రిటీ పీపుల్‌.

తాప్సీనే ఓ అడుగు ముందుకేసి.. రాజ్‌ షమాని పాడ్‌కాస్ట్‌లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించింది. పదేళ్లుగా మథియస్‌ బోతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడిక ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాప్సి మాత్రం వీటిని ఖండించడం గమనార్హం. ఏదేమైనా మథియస్‌ పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఎవరీ మథియస్‌ బో?
జూలై 11, 1980లో డెన్మార్క్‌లో జన్మించాడు మథియస్‌ బో. 1998లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే డబుల్స్‌ విభాగంలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థాయికి చేరుకున్నాడు. 

యూరోపియన్‌ చాంపియన్‌షిప్స్‌-2006లో పురుషుల డబుల్స్‌ విభాగంలో రజతం గెలిచిన మథియస్‌ బో.. 2010లో డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లునెగ్గాడు. 2011లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా అవతరించాడు.

ఒలింపిక్‌ మెడల్‌ విన్నర్‌
ఈ ఆ తర్వాత సహచర ఆటగాడు కార్‌స్టన్‌ మొగెన్సన్‌తో కలిసి మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. చైనాలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. 2013 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లోనూ సిల్వర్‌ మెడల్‌ అందుకుంది ఈ జోడీ.

ఇక 2015లో యూరోపియన్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మథియస్‌ బో.. 2012, 2017లో యూరోపియన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ విజేతగానూ నిలిచాడు. 

భారత బ్యాడ్మింటన్‌ మెన్స్‌ జట్టు కోచ్‌గా..
దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన ఆటగాడిగా కొనసాగిన మథియస్‌ బో.. 2020లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ చిరాగ్‌ శెట్టి అభ్యర్థన మేరకు కోచ్‌గా అవతారమెత్తాడు.

మనోళ్లను నంబర్‌ వన్‌గా నిలిపి
2021 నుంచి చిరాగ్‌ శెట్టి- ఆంధ్రప్రదేశ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి సహా భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ టీమ్‌కు మార్గదర్శనం చేస్తున్నాడు మథియస్‌ బో. చిరాగ్‌- సాత్విక్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ జోడీగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు.

తమ విజయాలకు మథియస్‌కే క్రెడిట్‌ ఇవ్వాల్సి ఉంటుందని ఈ ఇద్దరు ప్లేయర్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా! ఇక ప్రస్తుతం మథియస్‌ బో చిరాగ్‌- సాత్విక్‌ను 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.   

సేవలోనూ ముందే..
తన ప్రేయసి తాప్సితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మథియస్‌కు అలవాటు. ఇటీవలే వీరిద్దరు నన్హీ కాలి ప్రాజెక్టులో భాగమై.. బాలికా విద్య ఆవశ్యకతను చాటిచెప్పే బాధ్యత తీసుకున్నారు.

Advertisement
Advertisement