WC 2023: అద్భుతం చేశారు.. మా బ్యాటింగ్‌ బాలేదు.. ఇదంతా వాళ్ల వల్లే: రోహిత్‌ శర్మ | WC 2023 Ind vs Eng: We Were Not Great With Bat, Says Rohit Sharma - Sakshi
Sakshi News home page

#RohitSharma: అద్భుతం చేశారు.. మా బ్యాటింగ్‌ బాలేదు.. ఇదంతా వాళ్ల వల్లే: రోహిత్‌ శర్మ

Published Mon, Oct 30 2023 8:35 AM

WC 2023 Ind vs Eng Rohit Sharma: We Were Not Great With Bat Our Seamers - Sakshi

WC 2023- Ind vs Eng- Rohit Sharma Comments: ‘‘కఠిన పరిస్థితులు ఎదురైనపుడల్లా అనుభవజ్ఞులైన మా ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడి జట్టును గెలిపించడంలో ముందుంటారు. ఈ మ్యాచ్‌తో ఆ విషయం మరోమారు రుజువైంది. పట్టుదలగా పోరాడి జట్టుకు విజయం అందించారు.

టోర్నీ ఆరంభం నుంచి తొలి ఐదు మ్యాచ్‌లలో మేము సెకండ్‌ బ్యాటింగ్‌ చేశాం. కానీ ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. నిజానికి ఇంగ్లండ్‌ ఈరోజు అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. ఈ పిచ్‌పై మేము ఈమాత్రం స్కోరు చేయగలిగాం’’

మా బ్యాటింగ్ బాలేదు
‘‘మా బ్యాటింగ్‌ ఈరోజు మరీ అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితుల్లో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మేము అది చేసి చూపించాం. అయితే, నాతో సహా అంతా ఆఖరి వరకు ఇంకాస్త పోరాడాల్సింది. 

ఇంకో 30 పరుగులు చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా ఆట మొదలైన కాసేపటికే రెండు కీలక వికెట్లు కోల్పోయి కూడా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలగడం మాకు సానుకూలాంశం. ఈరోజు మా పేసర్లు నిజంగా అద్భుతం చేశారు’’

బంతి బాగా స్వింగ్‌ అయింది
‘‘నామమాత్రపు స్కోరుకు పరిమితమైన వేళ వాళ్లపైనే పూర్తి భారం పడినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు రాబట్టడంలో సఫలమయ్యారు. బంతి బాగా స్వింగ్‌ అయింది’’

బ్యాటర్లు రాణించడం ముఖ్యం
‘‘ఈ పరిస్థితులను తమకు పూర్తి అనుకూలంగా మార్చుకున్న మా బౌలర్లు బంతి ఎక్కడ పడుతుందో కూడా తెలియకుండా బ్యాటర్లను తికమకపెట్టారు. మా జట్టులో మెరుగైన స్పిన్నర్లు, సీమర్లు ఉన్నారు. ఇలాంటి పిచ్‌లపై ఆడిన అనుభవం వాళ్లందరికీ ఉంది. అయితే బ్యాటర్లు రాణించి మెరుగైన స్కోరు సాధించడం అన్నిటికంటే ముఖ్యం. 

అలాంటపుడు వాళ్లపై కాస్త ఒత్తిడి తగ్గి మరిన్ని అద్భుతాలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారన్న హిట్‌మ్యాన్‌.. తక్కువ స్కోరును డిఫెండ్‌ చేయడంలో తమ బౌలర్లు సఫలమయ్యారని ప్రశంసించాడు.

అజేయంగా ఆరు విజయాలతో
కాగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ప్రపంచకప్‌-2023లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఆరంభం నుంచీ ఓటమన్నదే లేని రోహిత్‌ సేన ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(9), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(0), శ్రేయస్‌ అయ్యర్‌(4) పూర్తిగా నిరాశ పరచగా.. రాహుల్‌(39)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.  ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌కు జతై 49 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది టీమిండియా.

టీమిండియా పేసర్లు అదుర్స్‌
అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా 3, మహ్మద్‌ షమీ 4 వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ 2, రవీం‍ద్ర జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు. వీరి విజృం‍భణతో 129 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కావడంతో టీమిండియా మరోసారి జయభేరి మోగించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(87) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: విరాట్‌ కోహ్లి డకౌట్‌.. ఈజీ క్యాచ్‌ ఇచ్చి! ఇదే తొలిసారి! వీడియో వైరల్‌

Advertisement
Advertisement