నిప్పులు చెరిగిన ఫెర్గూసన్‌.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌ | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన ఫెర్గూసన్‌.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌

Published Fri, Feb 23 2024 3:30 PM

Australia Beat New Zealand By 72 Runs In 2nd T20, Clinches Series - Sakshi

ఆక్లాండ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడింది. ఫెర్గూసన్‌ నిప్పులు చెరిగినప్పటికీ (3.5-0-12-4) న్యూజిలాండ్‌ ఓటమిపాలైంది. ఫెర్గూసన్‌ ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్‌ 17 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసి, 72 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను  ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

నిప్పులు చెరిగిన ఫెర్గూసన్‌..
ఫెర్గూసన్‌తో పాటు ఆడమ్‌ మిల్నే (2/40), బెన్‌ సియర్స్‌ (2/29), మిచెల్‌ సాంట్నర్‌ (2/35) రాణించడంతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ట్రవిడ్‌ హెడ్‌ (45) కాస్త పర్వాలేదనిపించాడు. కమిన్స్‌ (28), మార్ష్‌ (26), టిమ్‌ డేవిడ్‌ (17), స్టీవ్‌ స్మిత్‌ (11), నాథన్‌ ఇల్లిస్‌ (11 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మ్యాక్స్‌వెల్‌ (6), ఇంగ్లిస్‌ (5), మాథ్యూ వేడ్‌ (1), జంపా (1), హాజిల్‌వుడ్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు. 

జంపా మాయాజాలం..
175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. ఆడమ్‌ జంపా (4-0-34-4) మాయాజాలం దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్లలో ఇల్లిస్‌ (2/16), హాజిల్‌వుడ్‌ (1/12), కమిన్స్‌ (1/19), మార్ష్‌ (1/18) కూడా రాణించారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ (42) చేశాడు. ఫిలిప్స్‌తో పాటు జోష్‌ క్లార్క్‌సన్‌ (10), బౌల్ట్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

ఫిన్‌ అలెన్‌ (6), విల్‌ యంగ్‌ (5), సాంట్నర్‌ (7), చాప్‌మన్‌ (2), మిల్నే (0), ఫెర్గూసన్‌ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ డెవాన్‌ కాన్వే బ్యాటింగ్‌కు దిగలేదు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో మ్యాచ్‌ ఫిబ్రవరి 25న ఇదే ఆక్లాండ్‌లో జరుగనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement