Sakshi News home page

గూండాలు, సైకోల్లా టీడీపీ సభ్యులు 

Published Fri, Sep 22 2023 4:48 AM

Ministers and MLAs are fires on tdp - Sakshi

సాక్షి, అమరావతి: శాసన సభలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గూండాలు, సైకోల్లా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. వారు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు సభ ప్రారంభంలోనే చేసిన రచ్చను తీవ్రంగా తప్పుబట్టారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తగిన ఫార్మాట్‌లో వస్తే ఎంత­సేపైనా చర్చిద్దామని చెబుతున్నా వినిపించుకోకుండా పోడి­యం వద్దకు వెళ్లి స్పీకర్‌ను చుట్టుముట్టి, ఆయనపై కాగితాలు విసిరి, మానిటర్‌ను, గ్లాసును పగుల­గొట్టి టీడీపీ సృష్టించిన గందరగోళం సభా కార్య­కలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందని తెలి­పారు. హిందూపురం ఎమ్మె­ల్యే బాలకృష్ణ సభలో మీసం మెలేసి, తొడగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సభ్యుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే..

రచ్చకోసమే అసెంబ్లీకి.. 
టీడీపీ నేతలు రచ్చ­కోసమే అసెంబ్లీకి వస్తు­­­న్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి పారిపో­తు­న్నారు. సభలో రేపు స్కిల్‌ డెవ­లప్‌మెంట్‌ పైన చర్చిస్తున్నాం. 26న ఫైబర్‌ నెట్, 27న ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై చర్చ ఉంది. ధైర్యం ఉంటే టీడీపీ చర్చకు రావాలి. సభలో బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు. – ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి

ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్‌ ముందు కాదు 
టీడీపీ సభ్యులు సభలో గూండాలు, సైకోల్లా ప్రవర్తించారు. స్పీకర్‌ చైర్‌ మీద గౌరవం లేకుండా స్పీకర్‌ చుట్టూ చేరి అరుస్తూ పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారు. మానిటర్, మంచి నీటి గ్లాస్‌ పగులగొట్టారు. శాసన సభ సమావేశాలను బాలకృష్ణ షూటింగ్‌ అనుకుంటున్నాడేమో. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడు.  ఏ రోజూ ప్రజా సమస్యలను ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లల్లో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు.

తండ్రి ఎన్టీఆర్‌ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. బాలకృష్ణా.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం వంటి జగన్‌ ముందు కాదు. బాలకృష్ణకు తెలిసిందల్లా షూటింగ్‌లకు వెళ్లడం... ఈవెంట్లలో ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడటం.

సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి ఆధారాలను పెద్ద స్క్రీన్లపై చూపిస్తామనే భయంతోనే టీడీపీ రివర్స్‌ డ్రామా ఆడింది. దమ్ము, ధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధం. సెంట్రల్‌ జైలు చంద్రబాబు కట్టిందేనని వాళ్లే చెబుతున్నారు. అంటే ఇన్నాళ్లూ అక్కడ ఖైదీలకు ఏ సదుపాయాలూ లేకపోయినా పర్లేదు కానీ చంద్రబాబుకు ఉండాలా?.     – మంత్రి ఆర్కే రోజా

బాబుకు తప్పించుకునే అవకాశం లేదు 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో సాక్ష్యాధా­రాలతో దొరికిన చంద్రబాబుకు తప్పించుకొనే అవకాశం లేదు. చంద్రబాబు అనేక పాపాలు, నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్‌ని, ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. ఒక ఎమ్మెల్సీని కొంటూ దొరికారు. మీడియా బలంతో బయట పడ్డారు. చివరికి చట్టానికి దొరికారు. కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను తెచ్చారు. వారు కూడా నేరం జరగలేదని అనటంలేదు. టెక్నికల్‌ అంశాలనే ప్రస్తావిస్తున్నారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పాపాలను ఒప్పుకోవాలి. దొంగను పట్టుకుంటే సానుభూతి రాదు. నకిలీ సర్వేలతో సానుభూతి పొందాలని చూస్తే ఉపయోగం లేదు.
– మంత్రి అంబటి రాంబాబు

స్కామ్‌ జరగలేదని చెప్పరేం?
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరగ­లేదని టీడీపీ చెప్పడంలేదు. స్పీకర్‌ చర్చిద్దామని చెబుతున్నా టీడీపీ ముందుకు రావడంలేదు. చంద్రబాబును అరెస్టు చేయ­కూడదని అంటున్నారే తప్ప స్కిల్‌ స్కామ్‌ గురించి మాట్లాడటంలేదు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫైబర్‌ నెట్‌ కేసులో కూడా అవినీతి జరిగింది. ఈ ఐదు రోజుల్లో చంద్రబాబు అవినీతిపై చర్చించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం
స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో కూర్చుని సత్య హరిశ్చంద్రుడిని అంటూ బిల్డప్‌ ఇస్తున్నాడు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో యువతను దోచుకున్నాడు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యలపై చర్చించాడా? తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఆయనపై చెప్పులు వేయించినప్పుడు బాలకృష్ణ పౌరుషం ఏమైంది? కక్ష సాధించాలంటే చంద్రబాబును ఎప్పుడో అరెస్టు చేసే వాళ్లం. – ఎమ్మెల్సీ పోతుల సునీత

సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించారు
సభలో టీడీపీ సభ్యు­లు దారుణంగా వ్యవ­హ­రించారు. బాలకృష్ణ సిని­మాల్లో మాదిరిగా తొడ­లు కొడుతూ, మీసాలు తిప్పడం దురదృష్టకరం. సస్పెన్షన్‌ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవ్‌ సెల్‌ ఫోన్‌తో చిత్రీకరించాలని చూశారు. సభ నుంచి బయటకు వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ వారు మీసాలు తిప్పినా, తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

టీడీపీ సభ్యులకు భయం 
చంద్రబాబు అవినీతిపై చర్చ అంటే టీడీపీ సభ్యులకు భయం. వారు చంద్రబాబు అరెస్టు పైనే మాట్లాడు తున్నారు. స్కిల్‌ స్కామ్‌పై చర్చిద్దామంటే పారిపోతున్నారు. స్కామ్‌పై చర్చిస్తే దొరికిపోతామన్నది వారి ఆందోళన. చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతిపై చర్చించి నిజనిజాలను ప్రజల ముందుంచుతాం. – ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు

Advertisement

What’s your opinion

Advertisement