ఎవరెవరికి... ఏమేమిద్దాం! | Sakshi
Sakshi News home page

ఎవరెవరికి... ఏమేమిద్దాం!

Published Sat, Jan 6 2024 4:02 AM

Incessant debate in the Congress on the filling up of nominated posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నామినేటెడ్‌ పోస్టుల పందేరంపై అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ పదవులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల గాందీభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన తర్వాత ఈ చర్చ ఉధృతమైంది. భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పిన సీఎం ఎప్పుడన్న దానిపై స్పష్టం చేయకపోవడంతో అసలు ఈ పోస్టుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది? తొలిదఫాలో ఎన్ని కార్పొరేషన్లు భర్తీ చేస్తారు? అందులో కీలకమైన కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయి? ఆ కీలక కార్పొరేషన్లే కాకుండా నామినేటెడ్‌ హోదాలు ఎవరెవరికి దక్కుతాయన్నది ఇప్పు­డు గాందీభవన్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

ఏ ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటుండటం గమనార్హం. ఇక, సంక్రాంతికి ముందే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఉంటుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ, సంక్రాంతికి ముందే ఉంటుందా? లేక సంక్రాంతి తర్వాత ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టత రావడం లేదు. అటు ఎమ్మెల్యే కోటా, ఇటు పట్టభద్రుల ఎమ్మె­ల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వాయిదా పడుతుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. 

లోక్‌సభ ఎన్నికల్లోగా ఖాయం 
అయితే, లోక్‌సభ ఎన్నికల్లోపు మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్‌ భర్తీ ఉంటుందనే చర్చ జరుగుతుండగా, సంక్రాంతిలోపు భర్తీ చేస్తే మాత్రం తొలి దఫాలో కేవలం 10 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులే నింపుతారని, అదే జాప్యం జరిగితే మాత్రం కొన్ని పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తొలిదఫా నామినేటెడ్‌ పందేరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకని వారు, పార్టీ కోసం త్యాగం చేసిన వారు, జిల్లా స్థాయిలో ముఖ్య హోదాల్లో ఉన్న వారికి మాత్రమే అవకాశముంటుందని సమాచారం.  

ఆశావహులు ఎవరెవరంటే.. 
ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఒబేదుల్లా కొత్వాల్, చారకొండ వెంకటేశ్, రాజీవ్‌రెడ్డి, కేతూరి వెంకటేశ్‌ (మహబూబ్‌నగర్‌), కె.కె.మహేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రమ్యారావు, నేరెళ్ల శారద (కరీంనగర్‌), చల్లా నర్సింహారెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, సామా రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), విశ్వప్రసాద్, నల్లాల ఓదెలు (ఆదిలాబాద్‌), రవళి, వెన్నం శ్రీకాంత్‌ (వరంగల్‌), మెట్టు సాయికుమార్, మోతె రోహిత్, నూతి శ్రీకాంత్‌ (హైదరాబాద్‌), అన్వేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌ బిన్, కాసుల బాలరాజు, గడుగు గంగాధర్‌ (నిజామాబాద్‌), త్రిషా దామోదర్, ఆంజనేయులు గౌడ్‌ (మెదక్‌), బొర్రా రాజశేఖర్, లోకేశ్‌యాదవ్, కోటా రాంబాబు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, సాధు రమేశ్‌రెడ్డి, నాగా సీతారాములు, తూళ్లూరి బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు యాదవ్, శంకర్‌నాయక్, పున్నా కైలాశ్‌నేత, సర్వయ్య, ముత్తినేని వీరయ్య వర్మ, చెవిటి వెంకన్న యాదవ్‌ (నల్లగొండ) తదితరులు కీలక కార్పొరేషన్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కీలక నేతలు కూడా బడా కార్పొరేషన్‌ పదవులు ఆశిస్తున్నారు. 

మొత్తంగా ఆశలపల్లకిలో 3వేలమంది 
ఇక, మరికొన్ని కార్పొరేషన్లతో పాటు డైరెక్టర్ల స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేతల సంఖ్య 3వేలకు పైగా ఉన్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో కొందరికి ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వ్యవహారం మాత్రం అధికార కాంగ్రెస్‌ వర్గాల్లో రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది.  

భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు యాభై 
వాస్తవానికి, రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు చిన్నా చితకా, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 50 వరకు  ఉన్నాయని  కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. వీటిని వీలున్నంత త్వరగా భర్తీ చేస్తే రెండేళ్ల పదవీ కాలం చొప్పున మరో రెండు మార్లు ఇతర నేతలకు అవకాశమివ్వచ్చని, అలా 1,500 మంది వరకు నేతలకు నామినేటెడ్‌ పదవులు ఈ ఐదేళ్ల కాలంలో పంపిణీ చేయవచ్చనేది టీపీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది.

అయితే, తొలిదఫా భర్తీ ఎప్పుడు పూర్తవుతుందన్న దాన్ని బట్టి 1,500 మంది వరకు అవకాశం కల్పించవచ్చని, జాప్యం జరిగిన కొద్దీ నేతల సంఖ్య తగ్గిపోతుందని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఏఐసీసీ సిఫారసులు... ఇలా అనేక విధాలుగా కార్పొరేషన్‌ చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత కనిపిస్తోంది. ఒక్కో జిల్లాకు 5–10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement