నేడు గన్‌పార్కుకు నేనొస్తున్నా..దమ్ముంటే నువ్వూ రా | Sakshi
Sakshi News home page

నేడు గన్‌పార్కుకు నేనొస్తున్నా..దమ్ముంటే నువ్వూ రా

Published Fri, Apr 26 2024 4:18 AM

Harish Rao challenge to Revanth Reddy

‘రాజీనామా’పై సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌

నేడు అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా పత్రంతో నేనెళ్తున్నా..

మాట మీద నిలబడే వాడివి అయితే.. నువ్వూ రా.. రాకుంటే.. తోకముడిచినట్లే..

మెదక్‌జోన్‌/సాక్షి, హైదరాబాద్‌: రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ‘మెదక్‌ నుంచి రేవంత్‌రెడ్డికి మరోసారి చాలెంజ్‌ చేస్తున్నా.. శుక్రవారం ఉదయం 10గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా పత్రంతో వస్తున్నా.. దమ్ముంటే నువ్వూ అక్కడికి రా. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. బాండ్‌ పేపర్ల మీద రాసిన గ్యారంటీలు అమలు చేసే మాట నిజమైతే.. గన్‌పార్కు వద్దకు రా.. ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతు ల్లో పెడదాం. 
 

ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను మేధావులు తీసుకెళ్లి స్పీకర్‌కు ఇస్తారు. ఒకవేళ అమలుకాకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇస్తా రు.. నువ్వు సిద్ధమా? కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తోకముడిచినట్లే’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 
 

రాందాస్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో హరీశ్‌ ప్రసంగించారు. కాగా, స్పీకర్‌ ఫార్మాట్‌లో హరీశ్‌ రాజీనామా పత్రం సిద్ధం చేసుకున్నా రు. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు అమరుల స్తూపం వద్దకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆయనతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వెళ్లనున్నారు. 

మెడలు వంచుతాం.. 
‘అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కొడుకులు గాల్లో ఉన్నారు. హామీలు అమలు కావాలన్నా.. వారిని కిందకు దింపి మెడలు వంచాలన్నా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు కనీసం 12 సీట్లు ఇవ్వాలి’అని హరీశ్‌రావు అన్నారు. పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అసలు పేగులు వేసుకొని తిరిగేది రాక్షసులు కదా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు.   

జిల్లాలను తొలగించే కుట్ర చేస్తున్నారు.. 
పదేళ్లుగా కేసీఆర్‌ ఏం చేశారని సీఎం అనడం విడ్డూరంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు చేయడంతోనే రేవంత్‌రెడ్డి మెదక్‌ వచ్చి కలెక్టరేట్‌లో వారి అభ్యర్థి నామినేషన్‌ దాఖలుకు వచ్చారని, లేకుంటే సంగారెడ్డి పోయే వాడన్నారు. జిల్లాలు ఎక్కవయ్యాయని, కొన్నింటిని తొలగించే కుట్ర చేస్తున్నారని, అలాచేస్తే మెదక్‌ ప్రజలు ఊరుకుంటారా? అని అన్నారు. 
 

కనీసం చరిత్ర తెలుసుకోకుండా రేవంత్‌ మాట్లాడుతున్నాడని, ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యాకే సంగారెడ్డికి బీహెచ్‌ఈఎల్‌ లాంటి పరిశ్రమలు వచ్చాయనడం ఆయన విజ్ఞతకు నిదర్శనమన్నారు. 1952లోనే సంగారెడ్డికి బీహెచ్‌ఈఎల్‌ పరిశ్రమ వచ్చిందని, ఇందిరాగాంధీ 1980లో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.  కేసీఆర్‌ బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్‌లో వణుకు పుట్టిందన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement