చంద్రబాబు కన్నింగ్‌ ప్లాన్‌.. శ్రీనివాస్‌ ఎక్కడ? | Sakshi
Sakshi News home page

సీఐడీ ఝలక్‌.. నీళ్లు నమిలిన కిలారు రాజేష్‌!

Published Wed, Oct 18 2023 1:12 PM

Disappearance Of Pendyala Srinivas In Skill Scam Case - Sakshi

స్కిల్ స్కాంలో వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా  లోకేష్‌కు అందించిన కిలారు రాజేష్ నెల రోజులకుపైగా అజ్ఞాతంలో ఉండి హఠాత్తుగా సీఐడీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒక రోజు విచారణ తర్వాత మళ్లీ మాయం. మరి చంద్రబాబు నాయుడి పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడ ఉన్నట్లు?. శ్రీను  విదేశాలకు చెక్కేశాడా? లేక  కిలారు రాజేష్ మాయ మాటలు చెప్పినట్లు అతగాడు కూడా ఏపీలోనో ఢిల్లీలోనో దాగి ఉన్నాడా?.

స్కిల్ కార్పొరేషన్‌లో అసలు కుంభకోణమే జరగలేదని వాదిస్తున్న టీడీపీ నేతలు కానీ.. వారికి వంతపాడే ఎల్లో మీడియా కానీ ఏ తప్పూ జరగకపోతే  పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌ ఎందుకు పారిపోయారో? ఎందుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు హాజరు కాలేదో చెప్పాలంటున్నారు న్యాయ రంగ నిపుణులు. రూ.371 కోట్లు అవినీతి బాగోతంతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం గుడ్డిగా విడుదల చేసిన 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన ఘరానా దొంగలు.. ఆ తర్వాత ఆ డబ్బును హవాలా మార్గంలో  బాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్.. లోకేష్  సన్నిహిత సహచరుడు కిలారు రాజేష్‌లకు పంపారు. ఆ ఇద్దరూ డబ్బు అందుకున్నట్లు ఇప్పటికే  ఆధారాలు  వెలికి తీసింది ఈడీ. తాము అందుకున్న డబ్బును వారు చంద్రబాబు, లోకేష్‌లకు అందజేశారని ఆరోపణ. అందులో రూ.27 కోట్ల రూపాయలను చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ  ఖాతాలో జమ చేసిన ఆధారాలను కూడా సీఐడీ సేకరించి కోర్టు ముందు ఉంచిన సంగతి తెలిసిందే.

సీఐడీ ప్రశ్నల వర్షం..
చంద్రబాబు అరెస్ట్‌కు నాలుగు రోజుల ముందు సెప్టెంబరు 5న  హవాలా లావాదేవీపైనే విచారించడానికి శ్రీనివాస్‌కు.. లోకేష్ కుడిభుజం కిలారు రాజేష్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. అంతే రాత్రికి రాత్రే ఇద్దరూ మాయం అయిపోయారు. ఇద్దరూ విదేశాలకు చెక్కేశారని  ప్రచారం జరిగింది. నెల రోజుల తర్వాత నేనిక్కడే ఉన్నా అంటూ కిలారు రాజేష్ సీఐడీ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఇన్ని రోజులూ ఏ కలుగులో దాగున్నావని పోలీసులు అడిగితే రాజేష్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలేశాడు.

ఇక రెండో కీలక నిందితుడు పెండ్యాల శ్రీనివాస్ కూడా  బయటకు వస్తే దర్యాప్తు మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అంతే కాదు,  ఆ డబ్బు ఏ ఖాతాలోకి పంపారో కూడా తేలిపోతుంది. అయితే, శ్రీనివాస్ మాత్రం  అడ్రస్ లేకుండా పోయాడు. నిజంగానే చంద్రబాబు కానీ.. శ్రీనివాస్ కానీ ఏ పాపం ఎరక్కపోతే, ఏ నేరానికి పాల్పడకపోతే సీఐడీ నోటీసులు ఇచ్చిన మరునాడే విచారణకు హాజరయ్యేవారు. అలా జరగలేదంటే వాళ్లు తప్పు చేసినట్లు రుజువైనట్లే అంటున్నారు నిపుణులు.

శ్రీనివాస్ గురించే ఢిల్లీలో ఓ చానెల్ డిబేట్‌లో నారా లోకేష్ మాట్లాడుతూ శ్రీనివాస్ అర్జంట్‌గా  అమెరికాకి పిక్నిక్ వెళ్లాడని చెప్పారు. ఏ పిక్నిక్‌కు వెళ్లాడు? ఎవరు పంపించారు? తిరిగి ఎప్పుడు రావాలని చెప్పారు? అన్నవి లోకేష్ చెప్పలేదు. కాకపోతే శ్రీనివాస్ కూడా ఎక్కడో దూరాన టీవీల ముందు కూర్చుని  చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాను భాగస్వామి అయిన కుంభకోణం గురించి కోర్టుల్లో ఏం విచారణ జరుగుతోందో.. తమ గురించి ఏమనుకుంటున్నారో  గమనిస్తూనే ఉండచ్చు. కాకపోతే, ఏదో ఒక రోజున కిలారు రాజేష్‌లానే శ్రీనివాస్ కూడా సీఐడీ ముందు కనిపించి నేను కూడా ఏపీలోనే ఉన్నానని ఓ కథ చెప్పినా చెప్పవచ్చంటున్నారు  విశ్లేషకులు.
-సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు.

Advertisement

తప్పక చదవండి

Advertisement