రేపే ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా | Sakshi
Sakshi News home page

రేపే ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా

Published Mon, Apr 1 2024 7:56 AM

Congress Election Committee Meeting Delhi Updates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్‌ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసింది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, రఘువీరారెడ్డి, జెడి శీలం హాజరయ్యారు. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశామని ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల వెల్లడించారు. రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.

కాగా, ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మధుసూధన్‌ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించారు. ఇందులో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు సూరజ్‌ హెగ్డే, షఫీ పరంబిల్‌లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేయగా.. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు.

తెలంగాణలో పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థుల ఖారారు
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు పార్లమెంటు స్దానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థులపైనా ఇవాళో, రేపో స్పష్టత వచ్చే అవకావం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement