దత్తపుత్రుడు.. ఓ త్యాగాల త్యాగరాజు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

భీమవరంలో దత్తపుత్రుడు, చంద్రబాబును ఏకిపారేసిన సీఎం జగన్‌

Published Fri, Dec 29 2023 1:22 PM

CM Jagan Slams Pawan Chandrababu At Bhimavaram Public Meeting - Sakshi

పశ్చిమ గోదావరి, సాక్షి:  ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్‌ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. భీమవరంలో ఇవాళ ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. ఆ వేదికను ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. 

.. మనసు రాని ఒకాయన పరిపాలనను మనం చూశాం. ఆ పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సీఎంగా పని చేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు. కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు. వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్టచతుష్టయానికి బిస్కెట్ల వేసినట్లు వేశాడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. వీళ్లకు తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా అధికారంతో ఏం చేశారంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తు పెట్టుకొనేటట్టుగా పాలన చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంమాత్రమే జరిగాయి. 

మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో ఎలా చేయగలిగాడు. ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేదని ఆలోచన చేయాలి. వాళ్లు చేసిన పరిపాలన వల్ల వాళ్లు ప్రజల మనసుల్లో లేరు. వారికి విలువలు లేవు. విశ్వసనీయత అంతకన్నా లేదు. వాళ్ల దృష్టిలో అధికారం అంటే కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. వాళ్లు బాగుపడటం కోసమే. వాళ్లందరినీ కూడా అడగాలని మీ అందరినీ కోరుతున్నా. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో చెబుతా. 

దుష్ట చతుష్టయానికి చెందిన ఈ గ్యాంగ్, ముఠాలో ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలుపెడతా. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ మన రాష్ట్రంలో ఉండదు. నాన్ లోకల్.  పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండడు. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో  కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని చెబుతాడు. తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని ఎవరినీ చూసి ఉండం. ఈయనను తప్ప.  దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే,  ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజునుమాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. 

ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం.  రియల్ లైఫ్ లో ఈ పెద్దమనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజీ స్టార్. 
ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులిచ్చేయడం.  ఏకంగా కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. 

నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు నాయకులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, ఇలాంటి వారిని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ చేయడం మొదలు పెడితే మన ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన చెల్లెళ్ల పరిస్థితి ఏమిటి? . ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని సమాజంలో, రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా? . ఇలాంటి ఆయన ఏ భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు. పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్ కు చెబుతున్నాడు. 

నేను అడుగుతున్నా. ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా? . నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా?. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తూ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్నిమోసం చేస్తారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తున్న చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు.  వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబం అయినా, పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా? ఎదగగలుగుతుందా? . ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా?.

వీరి చరిత్ర మరికొంత వివరంగా చెబుతా. చంద్రబాబు ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 3 సార్లు సీఎం అయ్యాడు. మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు. ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి?. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా,ఎప్పుడైనా ఈ పెద్దమనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ఓటు వేయాలని అడగాలి. మన అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం తాను అమలు చేసి ఉంటే చేశాను అని ఓటు అడగాలి. 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం అమలవుతున్న వైయస్సార్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ కార్యక్రమం తాను చేసి ఉంటే ఆ ఫలాలను అమలు చేశానని ఓటు అడగాలి.  మీ బిడ్డ హయాంలో వైయస్సార్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ అమలు చేసి ఉంటే అవి చేశానని ఓటు అడగాలి.  31 లక్షల ఇంటి స్థలాలు నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అందులో కడుతున్న ఇళ్లు మరో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేశాను, ఇంతకన్నా మెరుగైన కార్యకక్రమం చేశాను అని ఓట్లు అడగాలి.  మీ బిడ్డ హయాంలో నేరుగా డీబీటీ ద్వారా 2.45 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతోంది. లంచాలు, వివక్ష లేవు. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉంటూ ఎన్ని బటన్లు నొక్కి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలడా?

ప్రజల బ్యాంకు స్టేట్ మెంట్లు చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014-2019 మధ్య తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి ఓటు అడగగలడా?. కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా?. చంద్రబాబు అడగలేడు. ఎవరికీ తాను 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనే లేదు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభ అట. మీరందరూ చూసే ఉంటారు. చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా. చంద్రబాబును అడుగుతున్నా. మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం. ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఆ గ్రామంలో, గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్. 

ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి.. ఇది ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే కడుపుమంట తగ్గుతుంది. అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

బాబు చేయని అభివృద్ధి ప్రజలకు గుర్తు ఉండకూడదు, జగన్ ఇంటింటికీ చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు. దిక్కుమాలిన కథలు. దిక్కుమాలిన కథనాలు. ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లు, రకరకాల పార్టీలు, వ్యక్తల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. తోడేళ్లందరూ ఏకమై ఒక్క జగన్ మీద ఏకమై యుద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు. వీళ్లందరూ కూడా నమ్ముకున్నది వంచనను, మోసాన్ని. 

అన్ని వర్గాలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హామీలతో వస్తున్నాడు. అమలు చేసిన మంచిగానీ, మంచి స్కీములుగానీ ఇవేవీ లేవు కాబట్టే ఏకంగా మోసాలకు, ఈరోజు మేనిఫెస్టో అట.. ఇద్దరూ కలిసి ఇస్తారట. రంగు రంగుల వలలతో ప్రజల్నిమోసం చేసేందుకు వస్తారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నాడు. ఆరు గ్యారెంటీలన్నాడు. జగన్ ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి వారిని నమ్మవచ్చా? అని ఆలోచన చేయాలి. 

ఇలాంటి వారిని చూసినప్పుడు వేమన పద్యం గుర్తుకు వస్తుంది. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినురవేమ అని.  రెండు విషాలు(చం‍ద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి..) కలిస్తే అమృతం అవుతుందా? నలుగురు ఒక్కటవుతే కౌరవుల సంఖ్య పెరగుతుంది అంతే.. అని సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచల్ని మాత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Advertisement
Advertisement