ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం

Published Sat, Oct 21 2023 3:00 AM

Cheruku Sudhakar quits Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్లగొండ: ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.

దొరల తెలంగాణ కోసం బీఆర్‌ఎస్, ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్‌ అని పైకి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న భూస్వామ్య పోకడలకు ఇటీవలి పరిణామాలు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినప్పటికీ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విపరీత ప్రవర్తనను నిలువరించడంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని తెలిపారు.

ఉత్తమ్, జానారెడ్డి కూడా ఈ ప్రయత్నం చేయకపోవడంతో కోమటిరెడ్డి మరింత చెలరేగిపోయారని ఇలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్న రాజకీయ వేదిక వెతుకులాటలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దాడిని నిలువరించకపోగా నల్లగొండలో జరిగిన సభలో కోమటిరెడ్డిని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వారసుడిగా పోల్చడం ద్వారా తమను అవమానపరిచారని పేర్కొన్నారు.

వెక్కిరించినట్లు మాట్లాడారు: ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 55 మంది అభ్యర్థుల్లో 12 బీసీలకు కేటాయించారని, అయినా కోమటిరెడ్డి 12 సీట్లు ఇచ్చామంటూ వెక్కిరించినట్లుగా మాట్లాడు తున్నారని సుధాకర్‌ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి మాట్లాడిన తీరు యావత్‌ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనతో కలిసి ప్రయాణించిన వారికి ఈ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, చెరకు సుధాకర్‌తో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలు చర్చలు జరిపారని, శని, ఆది వారాల్లో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Advertisement