Sakshi News home page

హైకమాండ్‌కు కట్టుబడి ఉండాల్సిందే 

Published Thu, Dec 21 2023 6:25 AM

Chandrababu Comments On TDP Janasena Activists - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: హైకమాండ్‌ తీసుకునే నిర్ణయం ఏదైనా టీడీపీ, జనసేన కార్యకర్తలు కట్టుబడి ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుకుం జారీ చేశారు. వంద రోజుల తర్వా­త జనసేనను ఏ విధంగా ఆదరించాలో టీడీపీ చెబుతుందన్నారు. లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం విజయనగరం జిల్లా పోలిపల్లిలో విజయోత్సవ సభ నిర్వహించారు. కుప్పంలో జరిగిన లోకేశ్‌ పాదయాత్ర   ప్రారంభోత్సవంలో పాల్గొని, అక్క­డే తీవ్ర అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతూ మృతి చెందిన ఎన్‌టీఆర్‌ మనుమడు నందమూరి తారకరత్నకు ఈ సభలో నివాళులర్పించకపోవ­డంపై కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమైంది.

సభలో మాట్లాడిన నేతలు కనీసం తారకరత్న పేరు తలవకపోవడం నందమూరి కుటుంబం పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపునకు, వాడు­కొని వదిలేసే ఆయన తత్వానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సభ చివర్లో చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకు తాము భయపడేవాళ్లమని, ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వానికి సరెండరయ్యారని అన్నారు. తాను అధికారంలో ఉంటే 2020 నాటికే భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేవాడినని అన్నారు.

పాదయాత్ర చేసిన లోకేశ్‌పైన, వలంటీర్ల పైన కేసులు పెట్టినవారికి వడ్డీతో సహా అప్పగిస్తానన్నారు. జగన్‌ పాలనలో పరిశ్రమలు, ఉద్యోగాల్లేవని, విశాఖ మెట్రో పోయిందని, హెచ్‌ఎస్‌బీసీ పా­రిపోయిందని చెప్పారు. ఉత్తరాంధ్రలో సెటిల్‌మెంట్లు పెరిగాయన్నారు. టీడీపీ–జనసేన ఉమ్మ­డి మేనిఫెస్టోలు అమరావతి, తిరుపతిలో వెల్లడిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం, ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యో­గాలు, రూ.3 వేలు నిరుద్యోగ భృతి వంటి పలు హామీలు ఇచ్చారు. వైసీపీలో ఎమ్మెల్యేలు పనికిరారని ఎమ్మార్వోల మాదిరిగా ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని, పనికిరాని వారు వాళ్లు కాదని, జగన్‌మోహన్‌రెడ్డి అని దూషించారు. 

మార్పు కోసం టీడీపీతో పొత్తు: పవన్‌ 
ప్రజల బాధలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేయలేకపోయాననే బాధ తనకు ఉందని జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. బాబును జైలులో పెడితే చాలా బాధ కలిగిందన్నారు. భువనేశ్వరి బాధను దూరం నుంచి అర్థం చేసుకున్నానని చెప్పారు. ఒంటరి మహిళలు, ఒంటరిగా ఉన్న ఆడపిల్లల డేటాను వలంటీర్లు సేకరిస్తున్నారని ఆరోపించారు. 2024లో మార్పు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, జగన్‌ను ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ పొత్తు లేకపోతే వైసీపీ గూండాలతో కర్రలు పట్టుకొని కొట్లాడవలసి వస్తుందని చెప్పారు. 

యుద్ధం ఆగదు: లోకేశ్‌ 
యువగళం ఆరంభం మాత్రమేనని, తాడేపల్లి కొంప తలుపులు బద్దలు కొట్టేవరకూ యుద్ధం ఆగదని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. యువగళం ఆపడానికి ఆనాడు జగన్‌ జియో 1 (జీవో 1 అనబోయి) తీసుకొచ్చారని అన్నారు. తన గొంతు ఎన్‌టీ రామారావు ఇచ్చారని, దీన్ని నొక్కే మగాడు పుట్టలేదని, పుట్టబోడని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ తదితరులు ప్రసంగించారు. 

అశోక్‌కు అవమానం 
టీడీపీలో అత్యంత సీనియర్‌ నేత, విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు సభలో అవమానం తప్పలేదు. చోటా మోటా నాయకులకు సభలో ప్రసంగించేందుకు అవకాశమిచ్చిన నేతలు.. అశోక్‌కు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన సొంత జిల్లాలో సభ పెట్టి, ఆయన్నే మాట్లాడనివ్వకపోవడం చర్చనీయాంశమైంది.  

సభ మధ్యలోనే వెళ్లిపోయిన కార్యకర్తలు! 
సభా ప్రాంగణం విశాఖ–కోల్‌కతా జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఇక్కడ పార్కింగ్‌ తదితర ఏర్పాట్లలో ప్రణాళికలోపం కారణంగా నేషనల్‌ హైవేపై గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమీపంలోని రిసార్ట్‌లో బస చేసిన లోకేశ్‌ గంటన్నర ఆలస్యంగా సాయంత్రం 4:30కి సభకు వచ్చారు. విశాఖకు ప్రత్యేక విమానాల్లో వచ్చిన చంద్రబాబు, పవన్‌ సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. బాలకృష్ణ, లోకేశ్‌ ప్రసంగిస్తుండగానే చాలామంది కార్యకర్తలు వెళ్లిపోయారు. 7:50 గంటలకు చంద్రబాబు ప్రసంగించే సమయానికే సభలో కుర్చీలు ఖాళీ అయిపోయాయి.  

Advertisement
Advertisement