ఈసారి ఆ తప్పులు చేయొద్దు!  | Sakshi
Sakshi News home page

ఈసారి ఆ తప్పులు చేయొద్దు! 

Published Tue, Apr 2 2024 5:36 AM

BJP Coordinating responsibilities for a senior leader - Sakshi

అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదు..  

అప్పట్లో మొక్కుబడిగా పోలింగ్‌ బూత్‌ కమిటీల నిర్వహణ... ఈసారి పార్టీ 

ఆఫీసు నుంచే కాల్‌సెంటర్‌ ద్వారా పర్యవేక్షణ... ఒక్కోబూత్‌కు సంబంధించి

సీనియర్‌ నేతకు సమన్వయ బాధ్యతలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్టీపరంగా చోటు చేసుకున్న లోపాలు, లోటుపాట్లు ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా కమలదళం జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు పకడ్బందీగా కార్యాచరణ అమలుకు చర్యలు చేపడుతోంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక నిర్వహించిన సమీక్షల్లో పార్టీనాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం అనేది ఓటమికి ప్రధాన కారణమని ముఖ్యనేతలు తేల్చారు. మరీ ముఖ్యంగా శాసనసభ ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న పోలింగ్‌ బూత్‌ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే విషయం కూడా నాయకత్వం దృష్టికి వచ్చింది. 

అప్పుడు జరిగిన తప్పులేవంటే..  
అప్పట్లో మొక్కుబడిగా పోలింగ్‌బూత్‌ కమిటీలు ఏర్పాటుకావడంతో వాటి నిర్వహణ సరిగా జరగలేదనేది స్పష్టమైంది. అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా.. అందులోని ఒక్కో పోలింగ్‌ బూత్‌లో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వివిధ వర్గాల మద్దతును కూడగట్టే దిశగా బూత్‌ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయలేదని వెల్లడైంది. పోలింగ్‌ సందర్భంగా కూడా ఈ కమిటీల పని విధానం సరిగ్గా లేదని, సభ్యులు అంకితభావంతో బాధ్యతలు నిర్వహించలేదని తేలింది.

వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయకపోయినా పేపర్‌పై వేసినట్టు చూపడం, గతంలో ఎప్పుడో వేసిన కమిటీలే ఎన్నికల నాటికి పనిచేస్తున్నట్టు చూపడం, ఆయా కమిటీల సభ్యులు తమకు బాధ్యతలు అప్పగించిన చోట్ల పనిచేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. వీటితో పాటు బూత్‌ కమిటీల స్థాయిల్లో మెరుగైన సమన్వయానికి ఉపయోగపడే వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేయకపోవడం, ఇంటింటికి వెళ్లి ‘ఓటర్‌ మాస్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌’వంటివి చేపట్టకపోవడం వంటివి ప్రధాన లోపాలుగా నాయకత్వం గుర్తించింది. 
 
ఈసారి కాల్‌సెంటర్‌ ద్వారా బూత్‌ల పర్యవేక్షణ 
తాజాగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో...గతంలో చేసిన తప్పులు మళ్లీ చోటుచేసుకోకుండా మెరుగైన సమన్వయ, పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు రాష్ట్రంలో పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు పకడ్బందీగా కార్యాచరణ అమలుకు కసరత్తు ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ ద్వారా పోలింగ్‌ బూత్‌ కమిటీల కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర పార్టీ నుంచి ఒక్కోబూత్‌కు ఒక్కొక్కరికి సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిల్లోనే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కో రాష్ట్రనాయకుడికి పోలింగ్‌బూత్‌ సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ ద్వారా 17 ఎంపీ సీట్ల పరిధిలో బూత్‌ కమిటీల నియామకం పూర్తిస్తాయిలో జరిగిందా లేదా ? వాటిలో ఎంత మంది సభ్యులున్నారు.. వారికి అప్పగించిన బాధ్యతలు సక్రంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం సమీక్షించనుంది.  

Advertisement
Advertisement