Sakshi News home page

ఇకపై మద్యం తాగి దొరికావో.. అంతే సంగతులు! జర జాగ్రత్త భయ్యా!! లేదంటే..

Published Sat, Oct 7 2023 1:04 AM

- - Sakshi

నిజామాబాద్‌: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారు కోర్టులో జరిమానా చెల్లించి తప్పించుకునేవారు. జిల్లాలో మద్యం మత్తులో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం నూతన ఆదేశాలను జారీ చేసింది.

ఇకపై తాగి వాహనాలు నడిపే వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష, వాహన లైసెన్స్‌ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటోంది. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మద్యం ప్రియుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

మందుబాబులకు కౌన్సెలింగ్‌..
మద్యం తాగి దొరికిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో మద్యం తాగి నడిపిస్తే కలిగే నష్టాలను వాహనాదారుడికి, కుటుంబసభ్యులకు వివరిస్తున్నారు. మద్యం తాగి దొరికిన వారి వివరాలు పీఎస్‌లో నిక్షిప్తమై ఉంటాయి. నగరంతోపాటు మండల కేంద్రంలో కూడా పోలీసులు మధ్యాహ్న సమయంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి దొరికిన వారిని కోర్టులో హాజరు పర్చడంతో వారికి కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తోంది.

కోర్టు నిర్ణయం మేరకు..
మద్యం తాగి దొరికిన వారిపై కోర్టు జైలు శిక్ష విధించడంతోపాటు జరిమానా విధిస్తారు. మొదటి సారి కాకుండా రెండోసారి దొరికిన వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోర్టు రవాణా శాఖకు సిఫార్సు చేస్తోంది. వాహనాదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను కోర్టు నిర్ణయం మేరకు ఏడాది నుంచి ఆరు నెలల వరకు రద్దు చేసే అవకాశం ఉంది.

కోర్టుకు పంపిస్తున్నాం..
తాగి వాహనాలు నడిపి తనిఖీలో పట్టుబడితే వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం. కోర్టు వారికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తోంది. తాగి నడిపితే జరిగే పరిణామాలపై కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు.

నగరంలోని ఒకటో టౌన్‌ పీఎస్‌ పరిధిలో ఓ వ్యక్తి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా మోతాదుకు మించి తాగినట్లు గుర్తించడంతో రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఇప్పటి వరకు జిల్లాలో మద్యం తాగి పట్టుబడి జైలు శిక్ష కొందరు అనుభవించి వచ్చారు. – చందర్‌రాథోడ్‌, ట్రాఫిక్‌ సీఐ, నిజామాబాద్‌

సంవత్సరంలో కేసులు..
2021 - 4226
2022 - 11684
2023 - 17004(జనవరి నుంచి సెప్టెంబర్‌)

Advertisement

What’s your opinion

Advertisement