ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు | Sakshi
Sakshi News home page

Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు

Published Mon, Nov 20 2023 3:26 PM

Day 9 Of Uttarkashi Tunnel Rescue Global Experts At Site - Sakshi

ఉత్తరకాశీ: నిర్మాణంలో ఉన్న సొరంగం కాస్తా కుప్పకూలడంతో అందులో తొమ్మిది రోజులుగా చిక్కుకుపోయిన కూలీలను రక్షించేందుకు ఇప్పుడు అంతర్జాతీయ బృందం ఒకటి సిద్ధమైంది. ఉత్తరకాశీలోని ఈ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఇప్పటివరకూ జరిగిన అనేకానేక ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. కూలీల వెలికితీతకు జరుగుతున్న ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సొరంగం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

'చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకొస్తాం. పనులు బాగా జరుగుతున్నాయి. మా బృందం మొత్తం ఇక్కడే ఉంది. సమస్యకు ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా కనుక్కుంటాం. ప్రస్తుతం ఇక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. క్రమపద్ధతిలో పని చేసుకుపోతున్నారు. బాధితులకు ఆహారం, మందులు సరియైన విధంగా అందిస్తున్నారు' అని  ఆర్నాల్డ్ డిక్స్ చెప్పారు. 

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగం. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. అయితే.. నవంబర్ 12 అర్ధరాత్రి సమయంలో సొరంగంలో కొంతభాగం కూలిపోయింది. దీంతో  41 మంది లోపలే చిక్కుకుపోయారు.  

ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్‌ సొరంగంలో డ్రిల్లింగ్‌ నిలిపివేత

Advertisement
Advertisement