Sakshi News home page

Kamal Haasan Biogrpahy In Telugu: నేడు కమలహాసన్‌ జీవితంలో రెండు ప్రత్యేకతలు

Published Tue, Nov 7 2023 6:47 AM

Kamal Haasan 69th Birthday Special - Sakshi

లోకనాయకుడు కమలహాసన్‌ నటుడిగా 65 వసంతాలు పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన కళాకారుడిగా ఎదిగారు విశ్వనటుడు. నటుడిగానే కాకుండా నృత్య కళాకారుడిగా, కథకుడిగా, మాటల రచయితగా, స్క్రీన్‌ ప్లే రైటర్‌గా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని శాఖల్లోని ఘనాపాటి అయిన కమలహాసన్‌ చేసిన ప్రయోగాలు బహుశా ఏ నటుడు చేసి ఉండరు. ఈ విశ్వనటుడికి నేడు ఎంతో ప్రత్యేకం.. నటుడిగా 65 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు నేడు (నవంబర్‌ 7) 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

బాల నటుడిగా పరిచయం అయ్యి, ఆ తరువాత ప్రతి నాయకుడిగా మెప్పించి, ఆపై కథానాయకుడిగా ఉన్నత శిఖరానికి చేరడం అనితరసాధ్యమే కదా! ఒక్క తమిళ సినిమాకే తన సేవలను పరిమితం చేయలేదు. తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో నటించి బహుభాషా నటుడిగా ప్రకాశిస్తున్నారు. ఇక రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ భావితరాల నాయకుడిగా ఎదగడానికి బాటలు వేసుకుంటున్నారు. అయినా కళామతల్లి సేవలను నిరాటంకంగా కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు.

ఇటీవల కమలహాసన్‌ నటించిన విక్రమ్‌ చిత్రం రికార్డులను బద్దలు కొట్టేసింది. ప్రస్తుతం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తన 233వ చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో 234వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా మంగళవారం ఈ విశ్వనటుడి 69వ పుట్టినరోజు. అంటే భారతీయ సినిమాకే పర్వదినంగా పేర్కొనవచ్చు.

సీనియర్‌ నటుడు శివకుమార్‌ కమల్‌ హాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో తమిళ సినీ పరిశ్రమలో అసహాయ సూర్యులు నడిగర్‌ తిలకం శివాజీ గణేషన్‌, విశ్వ నటుడు కమలహాసనే అని పేర్కొన్నారు. వారు చేసిన వైరెటీ పాత్రలు ఇప్పటివరకు మరెవరు చేయలేకపోయారని అన్నారు. శివాజీ గణేష్‌న్‌ చారిత్రక, సామాజిక, పౌరాణిక పాత్రలో ఎవరు ఊహించని స్థాయిలో చేశారని, అదే విధంగా కమలహాసన్‌ నటనతో పాటు భరతనాట్య కళాకారుడిగా, గాయకుడిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు.

1973 ప్రాంతంలో అరంగేట్రం, సొల్లదాన్‌ నినైక్కిరేన్‌, తంగత్తిలే వైరం, మేల్‌నాట్టు మరుమగళ్‌ తదితర చిత్రాల్లో మేమిద్దరం కలిసి నటించామని వాటిలో అధిక శాతం ప్రతి నాయకుడిగానే నటించారని పేర్కొన్నారు. అలా విలన్‌గా నటించి ఆ తర్వాత హీరోగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తొలి నటుడు కమల్‌ మాత్రమేనని అన్నారు. నాయకన్‌, గుణా, అన్భే శివమ్‌, అవ్వై షణ్ముగం, హేరామ్‌ వంటి చిత్రాల్లో నటుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారని, నటుడిగా ఇంకా సాధించడానికి ఏమీ మిగలలేదనీ అన్నారు. రాజకీయ రంగం మీ కోసం ఎదురు చూస్తోందన్నారు.

అమెరికా ఆరాధించిన అబ్రహాం లింకన్‌ కూడా రెండు మూడుసార్లు ఎన్నికల్లో అపజయాన్ని ఎదుర్కొన్న తరువాతే అధ్యక్షుడు అయ్యారని, మీరు కూడా సినిమాలో సాధించినట్లు రాజకీయాల్లో సాధించగలరు అని శివకుమార్‌ పేర్కొన్నారు. కాగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ నటించనున్న చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదల చేశారు. దీనికి సినీ వర్గాలు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement