నిధుల్లేవు.. పనుల్లో జాప్యం | Sakshi
Sakshi News home page

నిధుల్లేవు.. పనుల్లో జాప్యం

Published Fri, Jun 16 2023 6:28 AM

 జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్‌ చౌరస్తాలో కూడలి నిర్మాణం  - Sakshi

మంచిర్యాలటౌన్‌: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో శాఖకు సంబంధించిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. శుక్రవారం మున్సిపాలిటీల్లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహణకు ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రగతి నివేదిక రూపంలో వివరించి, ఉత్తమ సేవలను అందిస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందించి, సన్మానించేలా ఏర్పాట్లు చేశారు. బల్దియాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా 2020 ఫిబ్రవరి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రతీ నెల మున్సిపాలిటీ జనాభా, వార్డుల ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది.

మొదటి రెండేళ్లపాటు ప్రతీ నెల నిధులు విడుదల చేసినా ఆ తర్వాత జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నిధులతో పట్టణంలోని రోడ్లు, డ్రెయినేజీలు, అత్యవసరంగా చేపట్టే పనులతోపాటు సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 15 రోజులపాటు వార్డుల్లో నిర్వహించి, చెత్తాచెదారాన్ని తొలగించడం, డ్రెయినేజీల్లోని పూడికతీత పనులు చేసి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు మూడేళ్లుగా చేపడుతున్నారు. ఈ ఏడాది పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టకుండానే వర్షాకాలంలోకి అడుగు పెడుతుండగా, దశాబ్ది ఉత్సవాల పేరిట పట్టణ ప్రగతి వేడుకలను నిర్వహించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఏడాదిగా...
జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ కొంత మేర సమస్యలు లేకుండా చేస్తున్నారు. గత ఏడాది నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నెల వరకే నిధులు విడుదల చేయగా ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు నిధులు విడుదల కాలేదు. కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నా నిధులు రాక చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.

దీంతో కాంట్రాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్న పనులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రగతి నిధుల్లో కేంద్ర ప్రభుత్వానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కలిపి ప్రతీ నెల ఆయా మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. ఏడాదిన్నరపాటు సక్రమంగా నిధులు ఇవ్వగా.. 2021 ఆగస్టులో 25 శాతం కోత విధించింది.

మిగతా 75 శాతం నిధులు ప్రతి నెలా అందించడంలోనూ జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో మంచిర్యాలకు అత్యధికంగా రూ. 23.36 కోట్లు విడుదల కాగా, అందులో పెద్ద మొత్తంలో రూ.4.5 కోట్లు పార్కుల అభివృద్ధికి, రూ.4.5 కోట్లతో రోడ్లు, రూ.4 కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జంక్షన్ల నిర్మాణం కోసం కేటాయించారు. నిధుల జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదు.

జిల్లాలోని మున్సిపాలిటీలు, వార్డులు, పట్టణ ప్రగతి నిధుల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు ఇప్పటికి విడుదలైన ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రగతి నిధులు(రూ.కోట్లలో) విడుదలైన నిధులు(రూ.లక్షల్లో)

మంచిర్యాల 36 23.36 57

బెల్లంపల్లి 34 14.53 36

మందమర్రి 24 14.72 36

క్యాతన్‌పల్లి 22 10.42 25

లక్సెట్టిపేట 15 6.47 17

నస్పూర్‌ 25 20.58 51

చెన్నూరు 18 6.94 17

Advertisement
 
Advertisement
 
Advertisement