కామారెడ్డి క్రైం : తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కామారెడ్డి మండలం ఉగ్రవాయి ప్రాంతంలోని మూలమలుపులను శుక్రవారం పోలీసులు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రూరల్ పోలీసులు అర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రామన్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను స్పీడ్ లిమిట్ బోర్డులను, తెల్లరంగు గీతలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్‌అండ్‌బీ డీఈఈ, ఎస్‌ఐ రాజు, సిబ్బంది ఉన్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
పెద్దకొడప్‌గల్(జుక్కల్) : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కరించడమే తమ లక్ష్యమని (సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్‌శాఖ ఉప కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బిచ్కుందకు చెందిన విద్యుత్ వినియోగదారులు విద్యుత్ తీగలు చెట్లకు తాకడం వల్ల సరఫరా అంతరాయం ఉంటుందని వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రాన్ని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, విద్యుత్ మీటర్ రీడింగ్‌లను సకాలంలో తీయాలని విద్యుత్‌శాఖ అధికారులకు (సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ రామకృష్ణ సూచించారు. ఫోరంలో కేసులు వేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదన్నారు. రైతులందరూ మోటార్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రామేశ్వరరావు, ఏడీఈ బాలాజీ, పిట్లం ఏఈ బుజ్జి బాబు, నిజాంసాగర్ ఏఈ లక్ష్మణ్, స్థానిక ఏఈ సాయినాథ్ గౌడ్ పాల్గొన్నారు.
గ్రోమోర్ దుకాణానికి తాళం
బాన్సువాడ : బీర్కూర్ గ్రోమోర్ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన రైతులు శుక్రవారం గ్రోమోర్ దుకాణానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. బీర్కూర్‌కు చెందిన పలువురు రైతులు గ్రోమోర్ దుకాణంలో ఆర్‌కే విత్తనాలు కొనుగోలు చేసి యాసంగి పంట సాగు చేశారు. పంట కోత దశలో పూర్తిగా పొల్లు పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల పంట పొలాలను పలువురు శాస్త్రవేత్తలు సందర్శించి నకిలీ విత్తనాలతోనే పంట నష్టం వాటిల్లిందని నివేదికలు అందించారు. నష్టపోయిన రైతులకు గ్రోమోర్ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందిస్తామని దుకాణం యజమానులు హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఏ ఒక్కరికి నష్టపరిహారం అందించకపోవడంతో రైతులు గ్రోమోర్ దుకాణానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించే వరకు దుకాణాన్ని మూసి ఉంచాలని రైతులు పేర్కొన్నారు. బీర్కూర్‌లో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment