World Cycling Day: సైకిల్‌ తొక్కగలవా ఓ నరహరి ! | Sakshi
Sakshi News home page

World Cycling Day: సైకిల్‌ తొక్కగలవా ఓ నరహరి !

Published Wed, Jun 2 2021 8:44 PM

Why Are The People June 3 Celebrated As World Cycling Day - Sakshi

వెబ్‌డెస్క్‌: ఇప్పుడంటే కార్లు, బైకుల జమానా నడుస్తోంది కానీ, ఆర్థిక సంస్కరణలు అమలు కాకముందు 90వ దశకం వరకు సైకిల్‌ అనేది మనదేశంలో ఓ ప్రీమియం వస్తువు. ఇప్పుడు దేశంలో పెద్ద బ్యూరోక్రాట్లుగా, రాజకీయ నాయకులుగా పేరు తెచ్చుకున్న ఎందరో తమ జీవితంలో తొలి అభివృద్ధి పథాన్ని సైకిల్‌ తొక్కడంతోనే మొదలెట్టారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన సైకిల్‌ క్రమంగా సైడయి పోతోంది. 

మగమహరాజులకు ప్రత్యేకం
90వ దశకం వరకు పల్లె, పట్నం తేడా లేకుండా పెళ్లి సంబంధాలు మాట్లాడేప్పుడు సైకిల్‌ పెట్టడం అనేది ఘనతకు చిహ్నంగా ఉండేది. సైకిల్‌ విషయం తేలిన తర్వాతే మిగిలిన మాట ముచ్చట నడిచేవి. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్లడం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్లు పొలం పనులకు వరకు అన్నింటా సైకిల్‌కి ప్రత్యేక స్థానం ఉండేది. పాలు, పేపర్‌ బాయ్‌లకు సైకిలే జీవనాధారం. అద్దెకు సైకిళ్లు ఇచ్చే సెంటర్లు ప్రతీ టౌనులో ఉండేవి. సినిమా థియేటర్లు, స్కూళ్లలో సైకిల్‌ స్టాండులే ఉండేవి.... ఎక్కడో ఒక చోట వెహికల్‌ పార్కింగ్‌లు ఉండేవి. ఆరోజుల్లో కుర్రకారు ప్రేమ సందేశాలు పంపేదుకు సైకిలెక్కి అమ్మాయిల చుట్టూ శాటిలైట్లలాగా చక్కర్లు కొట్టేవారు. అప్‌కమింగ్‌ స్టార్‌గా చిరంజీవి ‘నీ దారి పూల దారి’ అంటూ ఎనిమిది రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా సైకిల్‌ తొక్కి మగ మహరాజుల వెండితెర బాక్సాఫీస్‌ని ఏలితే... అంతకంటే ముందే సైకిల్‌ ఎక్కిన ఎన్టీఆర్‌ ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనుడయ్యాడు. అంతటి ఘన చరిత్ర కలిగి సైకిల్‌కు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది ఐక్యరాజ్య సమితి. ప్రతీ ఏడు జూన్‌ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవం జరుపుతోంది. 

ఇలా వచ్చింది  
ప్రతీ ఏటా జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా పాటిస్తున్నారు. పోలాండ్‌కి చెందిన లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్త చేసిన కృషి కారణంగా సైకిల్‌ డే ఆవిర్భవించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రకటించాలంటూ సైకిల్‌ వేసుకుని తిరుగుతూ 57 ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సైకిల్‌ పెడల్స్‌ అరిగేలా ఐక్యరాజ్యసమితి కార్యాలయం చుట్టూ సైకిల్‌పై తిరిగారు. చివరకు ఆయన శ్రమ ఫలించి 2018లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 03ను ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించారు. 

కాలుష్య రహితం
కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ఒకే ఒక్క అంశం గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణ సమతుల్యత కాపాడటం. కాలుష్యం విడుదల చేయకుండా రవాణా సౌకర్యం కల్పించడం సైకిల్‌ ప్రత్యేకత. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక వ్యాయమం కూడా కలుగుతుంది. మెయింటనెన్స్‌ ఖర్చు అతి తక్కువ. ఇలా సైకిల్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. 

ఐక్యరాజ్య సమితి సూచనలతో
కాలుష్యం తగ్గించడంతో పాటు ​ఆరోగ్యానికి మేలు చేసే సైక్లింగ్‌ను ప్రోత్సహించాలంటూ సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. అనేక దేశాలు ఈ సూచనలు పాటిస్తున్నాయి. మన దగ్గర రోడ్లపై సైక్లింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కు, వరంగల్‌లో నిట్‌ దగ్గర ప్రత్యేక సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement