Chicago To Provide Free Condoms To Public School Students From 5th Grade - Sakshi
Sakshi News home page

ఐదో తరగతి విద్యార్థులకు ఫ్రీ కండోమ్స్‌.. తల్లిదండ్రుల ఆగ్రహం

Published Mon, Jul 12 2021 3:55 PM

Chicago Public Schools Program Puts Free Condoms in Every School - Sakshi

వాషింగ్టన్‌/చికాగో: యుక్త వయసులో పిల్లల్లో కలిగే శారీరక, మానసిక మార్పుల గురించి వారితో చర్చిస్తే ఎంతో మేలని మానసిక నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాబోధనలో భాగంగా సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి ప్రత్యేకంగా బోధిస్తారు. అయితే దేని గురించి అయినా చెప్పే పద్దతిలో.. అవసరం ఉన్న వరకు తెలియజేస్తే తప్పులేదు. అలా కాదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే అబాసు పాలవ్వాల్సి వస్తుంది. అమెరికాలోని చికాగో ఎడ్యుకేషన్‌ బోర్డు కూడా తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. 

సెక్స్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి.. ఆపై విద్యార్థులకు పాఠశాలలో కండోమ్స్‌ ఇవ్వాలని చికాగో ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. చికాగో పబ్లిక్ స్కూల్స్‌ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్‌లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ రూపొందించింది.

దీనిలో భాగంగా విద్యార్థులకు 'ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం' తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. 

ఇక సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు, హైస్కూళ్లలో ఒక వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్(చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు. అంతేకాక బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు కండోమ్స్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కండోమ్స్‌ అయిపోతే ప్రిన్సిపాల్స్‌ సదరు ఉన్నతాధికారులకు తెలియజేసి.. తెప్పించుకోవాలని తెలిపింది.

సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇలా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని... అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని... దీనిపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు. 

కానీ వైద్యులు, మానసిక విశ్లేషకులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఈ పాలసీ చాలా అవసరమని.. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే... వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే... వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement