జీహెచ్‌ఎంసీలో తేలని విగ్రహాల వివాదం | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో తేలని విగ్రహాల వివాదం

Published Fri, Jan 5 2024 5:02 AM

- - Sakshi

హైదరాబాద్: పక్క ఫొటోలో కనిపిస్తున్న విగ్రహాలు.. ఎడమ నుంచి కుడికి వరుసగా మహాత్మాగాందీ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, బీఆర్‌  అంబేడ్కర్‌లవి. వీరి సేవలకు గుర్తింపుగా విగ్రహాలు తయారు చేయించారు. కానీ.. దశాబ్ద కాలమవుతున్నా ఇవి ఆవిష్కరణకు మాత్రం నోచుకోవడంలేదు. రాష్ట్ర సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నెలకొన్న పరిస్థితి ఇది. కొత్తగా అధికారంలోకి వచ్చన కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా ఈ పరిస్థితి మారనుందా? అని ప్రజలనుకుంటున్నారు.

ఎత్తులు.. పైఎత్తులతో.. 
గ్రేటర్‌ అభివృద్ధికి పాటుపడిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విగ్రహం ఆవిష్కరించాలని తీర్మానించారు. 2010లో వైఎస్‌ జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సెపె్టంబర్‌ 2న ఆయన వర్ధంతికి ఆవిష్కరించాలని భావించారు. ఆ సమయానికి  పనులు పూర్తికాలేదు. ఆ తర్వాత విగ్రహం పూర్తయ్యాక ఆవిష్కరణ ఏర్పాట్లు జరుగుతుండగా ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్లు  వైఎస్‌ విగ్రహాన్ని అడ్డుకోవాలనే తలంపుతో అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న మహాత్మాగాం«దీ, అంబేడ్కర్‌ విగ్రహాలను తెచ్చి ఉంచారు. వైఎస్‌ విగ్రహం కింద వారివి ఉండటంతో వారిని తక్కువ చేయడం అవుతుందని భావించి ఆవిష్కరణలు ఆపివేశారు. అప్పటి నుంచీ ముసుగులోనే ఉన్నాయి. 

ఫలించని ప్రయత్నాలు.. 
అనంతరం అప్పటి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన  మేయర్‌ కార్తీకరెడ్డి ఆవిష్కరణలకు ప్రయత్నం చేశారు. ఒకే చోట ఉంటే ఎక్కువ, తక్కువ తేడాలొస్తాయి కనుక జీహెచ్‌ఎంసీ ఆవరణలోనే వేర్వేరు ప్రాంతాల్లో వాటిని ఆవిష్కరించాలని భావించారు. ఆ మేరకు స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం కూడా పొందారు కానీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు.  ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం తెలిసిందే. జీహెచ్‌ఎంసీలోని అధికార బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కానీ, ప్రతిపక్షాల్లోని వారు కానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో  ఇప్పటిదాకా అలాగే ఉన్నాయి.

అంతా రాజకీయమే.. 
జీహెచ్‌ఎంసీలో 2009–14 మధ్య కాలంలో కాంగ్రెస్, ఎంఐఎం పొత్తులో భాగంగా అధికారాన్ని పంచుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్ల రాజకీయంతో ఈ విగ్రహాలు అలా ముసుగుల్లోనే ఉన్నాయి. ఎలాగైనా వైఎస్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు కాకుండా చూసేందుకే టీడీపీ కార్పొరేటర్లు  మహాత్మాగాం«దీ, అంబేడ్కర్‌ విగ్రహాలను  తెప్పించారు.  అంతటితో ఆగకుండా బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే, ఎనీ్టఆర్,  సలావుద్దీన్‌ ఒవైసీలవి కూడా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఒవైసీ పేరుతో ఎంఐఎం మద్దతిస్తుందని భావించారు. కానీ ‘రాజకీయం’ అర్థం చేసుకున్న ఎంఐఎం నేతలు ఆ ఆలోచనను తిరస్కరించారు.   

Advertisement
Advertisement