కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేయాలి | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేయాలి

Published Sat, Nov 25 2023 4:44 AM

-

కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

కాచిగూడ: సీఎం కేసీఆర్‌ అవినీతి..కుటుంబ పాలనను అంతం చేయాలని కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు. కర్ణాటకలో తాము ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, దీనిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న తెలంగాణ మంత్రులకు దమ్ముంటే కర్ణాటకను సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్‌ విసిరారు. శుక్రవారం రాత్రి అంబర్‌పేట కాంగ్రెస్‌ అభ్యర్ధి డాక్టర్‌ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాచిగూడలో జరిగిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు రెండు ఒకటేనని, ఈ పార్టీలకు ప్రజల గుణపాఠం తప్పదన్నారు. సీఎం కేసీఆర్‌ రూ.లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని, అవినీతి కుటుంబ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను డిసెంబర్‌ 9 నుంచే అమలు చేయడం ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్‌ అవినీతిని బీజేపీ ప్రోత్సహిస్తుందని, ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిణ్‌రెడ్డి, పార్టీ నేతలు దిడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవి రమేష్‌, పులి జగన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement