TS Warangal Assembly Constituency: TS Election 2023: 'వివాదాస్పద బదిలీలపై' ఎన్నికల సంఘం ఆరా..!
Sakshi News home page

TS Election 2023: 'వివాదాస్పద బదిలీలపై' ఎన్నికల సంఘం ఆరా..!

Published Fri, Oct 13 2023 1:20 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి.. పైరవీలతో కోరుకున్నచోట పోస్టింగ్‌లు కొట్టిన రెవెన్యూ, పోలీస్‌ అధికారులపై బదిలీ కత్తి వేలాడుతోంది. వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం కమిషనరేట్‌లతోపాటు మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీస్‌ అధికారుల బదిలీల్లో ఎన్నికల నిబంధనలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

అత్యధికంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 21 మంది ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఏసీపీల వరకు ఈ తరహా పోస్టింగ్‌లు పొందారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అవినాశ్‌కుమార్‌కు, సంబంధిత అధికారులకు లేఖ నం. 434/1/టీఈఎల్‌/ ఎస్‌ఓయు3/ 2023 ద్వారా రాశారు. వరంగల్‌ కమిషనర్‌తోపాటు మహబూబాబాద్‌, ములుగు ఎస్పీలు బదిలీల్లో నిబంధన ఉల్లంఘన లేదంటూ వివరాలు పంపారు.

ఇది జరిగి సుమారు రెండు నెలలు కావొస్తుండగా.. తాజాగా బుధవారం వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి ఎస్పీలు చంద్రమోహన్‌, పుల్లా కరుణాకర్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు, రెవెన్యూ అధికారులపైనా త్వరలోనే బదిలీ వేటు పడనుందన్న చర్చ జరుగుతోంది.

నిబంధనల ఉల్లంఘనపై ఈసీఐ ఆరా..
వరంగల్‌ సీపీ, భూపాలపల్లి, మహబూబాబాద్‌ ఎస్పీలపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రెవెన్యూ, పోలీసుశాఖల్లో జరిగిన అన్ని బదిలీల్లో నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని జూన్‌లోనే కమిషన్‌ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్‌ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పంపింది.

అందుకు విరుద్ధంగా నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న అనేక మంది తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు పొందారు. ఈతరహాలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో 27 మంది పోస్టింగ్‌లు పొందినట్లు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వమైన ఫిర్యాదులు అందాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఎమ్మెల్యేల సిఫారసుల కారణంగా అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణకు మరోసారి గురువారం ఎన్నికల సంఘం ఆదేశించడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది.

‘రెవెన్యూ’లోనూ ఇదే తంతు..
మరోవైపు రెవెన్యూలోనూ అదే పరిస్థితి నెలకొంది. హనుమకొండ ఆర్డీఓగా రెండున్నర సంవత్సరాలకు పైగా పని చేసిన వాసుచంద్రను ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలోకి వస్తారని మొదట హైదరాబాద్‌కు బదిలీ చేశారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాలు గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోకి వస్తాయి కూడా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు బదిలీ చేసిన ఐదారు రోజులకే ఆయనను వరంగల్‌ జిల్లాలో ఆర్డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధితోపాటు మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నట్లు రెవెన్యూశాఖలోని కొందరు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ జిల్లాకు చెందిన చాలామంది తహసీల్దార్లు పొరుగు జిల్లా అయిన వరంగల్‌కు బదిలీ అయ్యారు. పలు నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక జిల్లాలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు ఇప్పుడు వరంగల్‌కు బదిలీ అయినా పాత నియోజకవర్గంలోకే మళ్లీ వచ్చారు. ఇలా జరిగిన చాలా బదిలీలు, పోస్టింగ్‌లపైనా ఎన్నికల సంఘం ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎందరిపై బదిలీ వేటు పడుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

► ఎనిమిదేళ్లుగా వరంగల్‌ జిల్లాలో పనిచేసి ఎస్‌బీ ఏసీపీ నుంచి అదే కమిషనరేట్‌ పరిధిలోని నర్సంపేటకు ఏసీపీగా పి.తిరుమల్‌ బదిలీ అయ్యారు. పరకాల ఏసీపీగా పోస్టింగ్‌ తీసుకున్న కిశోర్‌ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. డేవిడ్‌రాజ్‌ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. సి.సతీశ్‌ను జూలై 15న మామునూరు ఏసీపీగా నియమించారు. గతంలో దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్‌ జిల్లాలో పని చేశారు. ఇది ఎన్నికల కమిషన్‌ సూచించిన నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో ఉంది.
► మహబూబాబాద్‌ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్‌ఐ ఎస్‌కే యాసిన్‌, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను అదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్‌ కేసులో భాగస్వామి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్‌ఐగా కూడా నియమించారు.
► ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్‌, ఆర్‌ఐ కిరణ్‌, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌ దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది.

ఇలా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 21 మంది పోస్టింగ్‌లపై ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్‌ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో వీరిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement