మహిళలే పోషకులు.. కొత్త ఆలోచనకు వేదిక | Sakshi
Sakshi News home page

మహిళలే పోషకులు.. కొత్త ఆలోచనకు వేదిక

Published Thu, Jan 20 2022 12:58 AM

Womens are the nutritionists - Sakshi

ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అన్నట్టే ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని చూసి ఇల్లాలి వంటను చూడు అని కూడా అంటారు. తనవారందరి ఆరోగ్యాన్నీ పరిరక్షించేందుకు తగినట్టుగా ఆహారాన్ని వండిపెట్టడంలో గృహిణులకు సాటి లేదు. అందుకేనేమో... పోషకాహార రంగంలో దేశవ్యాప్తంగా మహిళలు సత్తా చాటుతున్నారు. డైటీషియన్లుగా, న్యూట్రిషనిస్ట్‌లుగా రాణిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఇండియన్‌ డైటెటిక్‌ డే రోజును పురస్కరించుకొని జరిగిన దేశవ్యాప్త ‘సాధన’ అసోసియేషన్‌ కార్యక్రమంలో పోషకాహార నిపుణులంతా కలిశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 99 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. వారిలో అన్ని కేటగిరీలలో కలిపి తెలుగు రాష్ట్రాల మహిళలకు ఎనిమిది పురస్కారాలు దక్కాయి.

పోషకాహార వైద్యులు అవంతీరావు, సంతోషి లక్ష్మి, వసుంధరా అయ్యగారి, జ్యోతి శ్రీనివాస్, అంజలి డాంగె, గౌరీప్రియ, హరితాశ్యామ్, సి.అంజలి... పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, అవార్డు గ్రహీతలతో మాట్లాడినప్పుడు ఈ రంగం పట్ల మహిళల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది.

ఆరోగ్యాన్ని పంచడానికి...
కొంత కాలంగా ఫిట్‌నెస్‌ రంగం ఊపందుకోవడంతో యువతులు న్యూట్రిషన్‌/డైటీషియన్‌లుగా ఈ రంగంలోకి వచ్చారు. దీంతో పాటు ఆసుపత్రులు, ఫిట్‌నెస్‌ స్టూడియోలు, కార్పొరేట్‌ కంపెనీలు, కాలేజీలు... వగైరాలన్నీ సర్టిఫైడ్‌ పోషకాహార నిపుణులైన మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసినా, మహిళలే పోషకాహార నిపుణులుగా టాప్‌లో ఉన్నారు.

ఇదీ మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. తమను తాము ఆరోగ్యకరంగా ఉంచుకుంటూ ఇతరులకు కూడా ఆరోగ్య పరంగా మంచి చేసే అవకాశం ఉండడంతో ఈ రంగానికి ఓటేస్తున్నారు. ‘వివిధ శాఖలకు అనుసంధానంగా ఉండటం, సమాజ సంక్షేమం కోసం పాటు పడేలా మంచి ఉద్దేశ్యం కూడా తోడవడంతో మహిళలు ఈ రంగం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు’ అంటారు పాతికేళ్లుగా పోషకాహార రంగంలో ఉన్న డాక్టర్‌ జానకి.

మహమ్మారి పెంచిన అవగాహన
ఇటీవల కరోనా మహమ్మారి వల్ల చాలామందిలో పోషకాహారం పట్ల అవగాహన మరింత పెరిగింది. వ్యాధినిరోధకత పెంచడంలో సరైన ఆహారం పాత్ర గురించిన ఆలోచన  చాలా మందిలో వచ్చింది. ప్రస్తుత సమాజంలో పోషకాహార నిపుణుల పాత్ర గురించి వివరిస్తూ ‘‘ఇప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్‌ ఉండటం ఎంత అవసరమో, వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్‌ కూడా అంతే అవసరంగా భావిస్తున్నారు.  ఒక్కో జబ్బుకు ఒక్కో రకమైన ఆహార ప్లానింగ్‌ చేయాల్సి ఉంటోంది.

ఇది కూడా న్యూట్రిషనిస్ట్‌ల ప్రాధాన్యత పెంచింది’’ అంటూ 22ఏళ్లుగా పోషకాహార నిపుణురాలిగా కొనసాగుతున్న జ్యోతి శ్రీనివాస్‌ విశ్లేషించారు. ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ సిఇఒ రక్టిమ్‌ ఛటోపాధ్యాయ్‌ మాట్లాడుతూ ‘‘ఈ రంగం మహిళల మనసులకు దగ్గరైనది కావడం, పార్ట్‌టైమ్‌గా, ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేసే వీలుండడం వల్ల చాలా మంది యువతులు ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. అందువల్లే కావచ్చు మేం ఏ డైటీషియన్‌ ప్రోగ్రామ్‌ చేసినా దానికి పురుషుల సంఖ్య కన్నా చాలా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు’’ అని తెలిపారు.

అడ్డంకులను అధిగమించడానికే...
‘కొందరు తక్కువ సమయంలో నైపుణ్యాలు పొందాలనుకుంటారు. ఎమ్మెస్సీ న్యూట్రిషన్‌ చదవరు. ఏదో ఒక ఫుడ్‌ పాయింట్‌ ఎంచుకుని, దానినే ప్రధానంగా ప్రజల మీద రుద్దడానికి చూస్తుంటారు. వ్యాపారపరంగా ఆలోచించేవారు చేసే పని ఇది. ఉదాహరణకు.. వెయిట్‌లాస్‌ మీద మార్కెట్లోకి విపరీతమైన ఉత్పత్తులు వచ్చాయి. అవి ఏ మేరకు అవసరం? వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరుకోవడం వల్ల కూడా గతంలో కన్నా ఇప్పుడు డైటీషియన్ల ప్రాముఖ్యం పెరిగింది’ అంటున్నారు పోషకాహార నిపుణులు.
 
కొత్త ఆలోచనకు వేదిక
ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే పోషకాహార నిపుణలు ఉండేవారు. ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌ వైజ్‌ డైటీషియన్స్‌ని నియమించుకుంటున్నారు. అమ్మాయిలకు ఇది నప్పే రంగం అని తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల కూడా ఈ రంగంలోకి అమ్మాయిలు ఎక్కువ శాతం వస్తున్నారు. అబ్బాయిలు వచ్చినా ఫుడ్‌ సైన్స్‌ మీద ఆసక్తి ఉన్నవారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు.
– డాక్టర్‌ జానకి, న్యూట్రిషనిస్ట్‌

సమాజ శ్రేయస్సుకు..
పోషకాహార నిపుణులుగా మహిళలు ఇంకా అధిక సంఖ్యలో రాణిస్తే వ్యాధుల నివారణకు అది ఎంతైనా ఉపయోగపడుతుంది. మిషన్‌ న్యూట్రిక్‌ కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఎనిమిది రాష్ట్రాల అసోషియేషన్స్‌తో కలిపి వర్క్‌ చేస్తున్నాను. సమతుల ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవన విధానం ఉన్నవారిలో ఏ ఫ్లూ వచ్చినా త్వరగా బయటపడతారు. ఇమ్యూనిటీకి రైట్‌ డైట్‌ అనేది కీలకం.
– జ్యోతి శ్రీనివాస్, న్యూట్రిషనిస్ట్‌

Advertisement
 
Advertisement