World Sight Day: రుచికి చూపెందుకు? జిహ్వ ఉంటే చాలు! | Sakshi
Sakshi News home page

రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్‌

Published Thu, Oct 12 2023 9:23 AM

Visually Challenged Vlogger Ashalatha A From Kerala - Sakshi

ఆశాలత చకచకా ఐదు నిమిషాల్లో వంట ముగుస్తుంది. ఇంత సులువుగా హాయిగా వండొచ్చా అనిపిస్తుంది వీడియో చూస్తే! కాని ఆమెకు చూపు లేదు. ఫుడ్‌ వ్లోగర్‌గా ఇన్‌స్టాలో లక్ష, యూ ట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకుంది. కొత్తిమీర పచ్చడి నుంచి రొయ్యల వేపుడు వరకూ ఆమె వంటలకు డిమాండ్‌. కళ్లు లేని వారు ఇన్‌స్పయిర్‌  చేయగలరు అంటుందామె. కాసర్‌గోడ్‌కు చెందిన ఆశాలత తెలుసుకోదగ్గ వ్యక్తి.

నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం. అంటే దృష్టి కలిగి ఉన్నందుకు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఎరుక తెచ్చుకోవాల్సిన దినం. దృష్టి లేని వారికి సమాజంలో అందాల్సిన సౌలభ్యాలు, అవకాశాల గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన దినం. దృష్టి లేకపోయినా తమ జీవన సమరాన్ని గొప్పగా సాగిస్తుంటే అందరం కలిసి ముందుకు సాగుదాం అని చెప్పాల్సిన దినం. పరస్పరం స్ఫూర్తి పొందాల్సిన దినం. కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో రావణేశ్వరంలో నివసించే ఆశాలతను చూస్తే ఆమె నుంచి పొందాల్సిన స్ఫూర్తి, ఆమెకు ఇవ్వాల్సిన ఉత్తేజం చాలానే ఉందనిపిస్తుంది.

మునివేళ్లకు కళ్లు
49 ఏళ్ల ఆశాలత మునివేళ్లకు కళ్లున్నాయ్‌ అనిపిస్తుంది ఆమె వంట చేసే పద్ధతి చూస్తే. కత్తిపీటతో కూరలు తరగడం, మిక్సీలో మసాలాలు వేసుకోవడం, స్టౌ ఆన్‌ చేసి మూకుళ్లు పెట్టడం, వండటం ఇవన్నీ మునివేళ్ల స్పర్శతోనే ఆమె గుర్తించి పూర్తి చేస్తుంది. ‘నాకు పుట్టుకతో దృష్టి లేదు. టీనేజ్‌ వరకూ వెలుతురు, చీకటి అర్థమయ్యేవి. టీనేజ్‌ దాటాక పూర్తిగా చీకటి కమ్ముకుంది. అయినప్పటికీ మా అమ్మా నాన్నలు నన్ను అంధురాలిగా చూస్తూ, నిరాశ పరుస్తూ పెంచలేదు. మా నాన్న టి.సి.దామోదర్‌ నన్ను చదువుకోమని బాగా ప్రోత్సహించాడు. బ్రెయిలీలోనే చదువు కొనసాగించి బి.ఇడి చేశాను.

ఆ తర్వాత టీచర్‌ ఉద్యోగం పొందాను. మా ఊరి గవర్నమెంట్‌ స్కూల్‌లోనే సోషల్‌ టీచర్‌గా పని చేస్తున్నాను’ అని చెప్పింది ఆశాలత. 18 ఏళ్లకు పెళ్లయ్యాక అత్తారింటిలో ఆమెకు వేరే ఏ పని చెప్పకపోయినా, ముగ్గురు పిల్లలు పుట్టినా పెంచడంలో అవస్థ రాకుండా చూసుకున్నా ఆశాలత అందరూ చేయదగ్గ పనులు చేయడానికి ప్రయత్నించేది. ‘దృష్టి లేకపోతే ఇంటి పనులు కష్టమే. ఇల్లు చిమ్మడం, బట్టలు ఉతకడం కంటే వంట చేయడం సులభం అని మెల్లగా నేను తెలుసుకున్నాను’ అందామె నవ్వుతూ.

వంటలో మేటి
సమయం దొరికితే వంట చేయడం మొదలెట్టిన ఆశాలత లాక్‌డౌన్‌లో పూర్తిస్థాయి వ్లోగర్‌గా మారి తన వంట వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. ‘అంధులు తమ రోజువారి పనులు ఎలా చేసుకుంటారో... ముఖ్యంగా వంట ఎలా చేసుకుంటారో చూపించాలనుకున్నాను’ అంటుందామె. దృష్టి లేకపోయినా ఆమె అంత సామర్థ్యంగా, కచ్చితంగా వంట చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పాటించే శుభ్రతను చూసి కూడా. 

‘మా అబ్బాయి అమల్‌ నా వీడియోలు షూట్‌ చేసి ఎడిట్‌ చేస్తాడు. నేను నా పిల్లలకు ఒకటే చెప్తాను.. మీ మీద మీరు ఆధారపడండి... అమ్మనాన్నలు మీ కోసం అన్నీ చేయాలనుకోకండి అని’ అంటుందామె. వెజ్, నాన్‌వెజ్‌ కూరలు ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఆమె వీడియోలు చేసి పెడుతుంది. అలాగే తరచూ కుటుంబంతో విహారాలు చేసి ఆ వీడియోలు కూడా పెడుతుంది. ‘అంధులు నన్ను చూసి ఇన్‌స్పయిర్‌ అవ్వాలి. ఇంట్లోనే ఉండకుండా లోకాన్ని తిరిగి అనుభూతి చెందాలి’ అంటుందామె. ఆమె తన వీడియోల్లో అంధులు కరెన్సీ ఎలా గుర్తిస్తారు, అలంకరణ సామాగ్రి ఎలా ఎంచుకుంటారు లాంటి అంశాల గురించే కాక సాధారణ స్త్రీలకు ఉపయోగపడే అంశాలను కూడా పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.     

(చదవండి: లక్ష సైనికుల  కోటి కన్నుల కెమెరా! )

Advertisement
Advertisement