అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు | Sakshi
Sakshi News home page

అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు

Published Sun, Mar 3 2024 8:11 AM

The beautiful world of Albert Einstein - Sakshi

ఐన్ స్టీన్.. ఈ పేరు వినగానే చింపిరి జుత్తుతో కనిపించే ఓ పెద్దాయన గుర్తొస్తాడు కదా. కాస్తంత చదువుకొని ఉంటే శక్తి నిత్యత్వ సూత్రం E = mc² గుర్తొస్తుంది. ఇంకా.. సాధారణ సాపేక్షత సిద్ధాంతం గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఐన్ స్టీన్ కేవలం భౌతికశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన శాంతికాముకుడు, రాజకీయ కార్యకర్త, చురుకైన జాత్యహంకార వ్యతిరేకి, నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన జీవితం నుంచి, మిత్రులకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ఆయన చెప్పిన జీవన సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం. 

మీ సమయాన్ని, కృషిని ముఖ్యమైన విషయాలపై వెచ్చించండి
మనం ఏదైనా పని చేయాలంటే శక్తిని వెచ్చించాలి. అలాగే రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక శక్తిని వెచ్చించాలి. ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తినాలనే దాని దగ్గర్నుంచి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీస్ కు ఎలా వెళ్లాలి లాంటి వాటికోసం మానసిక శక్తిని వెచ్చించడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. అందుకే చాలామంది టాప్ అచీవర్స్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాథాన్యం ఇవ్వరు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు మంగలి దగ్గరకు సమయం వృథా చేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే ఆ చింపిరి జుట్టు. ఇక ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎప్పడూ బ్లూ జీన్స్ మాత్రమే ధరిస్తాడు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ జుకర్ బర్గ్ కూడా అంతే. ఏ డ్రెస్ వేసుకోవాలనే నిర్ణయం కోసం తమ మానసిక శక్తిని వెచ్చించకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం ఆదా చేసుకుంటారు. 

ఎంత కష్టమైనప్పటికీ మీరు ఇష్టపడే పనులే చేయండి
ఐన్ స్టీన్ అంటే కేవలం భౌతిక శాస్త్రం మాత్రమే కాదు. ఆయన వయోలిన్ వాయిస్తాడు. పడవ కూడా నడుపుతాడు. తనకు మనసు బాలేనప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆయనీ పనులు చేస్తాడు. అలాగని ఐన్ స్టీన్ గొప్ప సెయిలర్ కాదు. కనీసం ఈత కూడా రాదు. పడవ బోల్తాకొట్టి మునిగిపోతుంటే జాలర్లు కాపాడిన సందర్భాలున్నాయి. అయినా ఎందుకు సెయిలింగ్ చేస్తాడంటే... ‘‘సముద్రంలో విహారయాత్ర ప్రశాంతతనిస్తుంది. విభిన్న దృక్కోణాలనుండి ఆలోచించడానికి అద్భుత అవకాశాలు కల్పిస్తుంది’’ అని ఆయనే చెప్పాడు. అందుకే మీ సబ్జెక్ట్ తో పాటు మీరు ఆనందించే ఒక హాబీని అలవాటు చేసుకోండి. అందులో మీరేం నిష్ణాతులు కావాల్సిన అవసరంలేదు. అది మీకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు.  

 పజిల్ మైండ్‌సెట్‌ను కలిగి ఉండండి.
జీవితంలో అనేకానేక సమస్యలు వస్తుంటాయి. వాటికి భయపడి పారిపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. సమస్యలను పజిల్ లా చూసి పరిష్కరించుకునే మైండ్ సెట్ ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఐన్‌స్టీన్ అలాగే చేసేవాడు. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పజిల్‌గా చూసి పరిష్కరించుకునేవాడు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు ముందు చాలామంది శాస్త్రవేత్తలు కాంతి వేగంతో కదిలే వస్తువులను చూశారు. కానీ ఐన్‌స్టీన్ మాత్రమే దాన్ని ఒక పజిల్ లా చూశాడు. సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అందుకే తప్పొప్పుల గురించి ఆలోచించకుండా పజిల్ పరిష్కారంపై దృష్టి పెట్టండి. 

 మిమ్మల్ని ఆకర్షించే విషయాల గురించి లోతుగా ఆలోచించండి
‘‘మీకు ఆసక్తిని కలిగించే ప్రశ్న ఎదురైతే సంవత్సరాల తరబడి దాన్నే పట్టుకుని ఉండండి. లోతుగా అన్వేషించండి. దానిపై పట్టు సాధించండి. అంతేతప్ప సులువుగా అందే విజయాలతో సంతృప్తి చెందకండి’’ అని  ఐన్ స్టీన్ కూడా ఒక లేఖలో చెప్పారు. అంతేకాదు.. ‘‘సమస్య క్లిష్టతను చూసి కుంగిపోకూడదు. ప్రయత్నిస్తే దేన్నయినా అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా పట్టువిడవని ప్రయత్నం మాత్రమే’’ అని తన స్నేహితుడు డేవిడ్ బోమ్ కు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఉదాహరణకు నేను ఎస్వీ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తిని కలిశాను.

ఆయన ప్రపంచంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్ లోనూ లోతైన అవగాహన లేదు. దీన్నే హారిజంటల్ లెర్నింగ్ అంటారు. అంటే.. అన్నీ పైపైన నేర్చుకోవడం. నేనేమో పాతికేళ్లుగా ‘జీనియస్’ అనే ఒకే పదాన్ని పట్టుకుని ఉన్నా. దాని పూర్వాపరాలు, లోతుపాతులు అర్థం చేసుకునేందుకు, పిల్లల్లోని జీనియస్ ను వెలికితీసే మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. దీన్నే వర్టికల్ లెర్నింగ్ అవసరం. ఏ రంగంలోనైనా పట్టు సాధించి, పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఈ వర్టికల్ లెర్నింగ్ అవసరం. 

 రాజకీయాలు మిమ్మల్ని ఆవేశంతో లేదా నిరాశతో నింపనివ్వవద్దు.
మనం రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మనల్ని నిత్యం అనేక విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగని ఆ రాజకీయాల్లో మునిగి, మీ లక్ష్యాన్ని జారవిడుచుకోకండి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఇజ్రాయిల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఐన్ స్టీన్ ను కోరారు. ‘‘రాజకీయాలు తాత్కాలికం. కానీ నా ఫార్ములాలు శాశ్వతం’’ అంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు.

జీవితం ప్రశాంతంగా సాగాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. సోషల్ మీడియా కాలంలో ఇది చాలా అవసరం. 
స్నేహితుడు, పరిచయస్తుడు లేదా పూర్తిగా అపరిచితుడు చేసిన పోస్ట్ వల్ల ఎలా కోపంతో ఊగిపోయామో లేదా గంటలు గంటలు వాదించామో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఎవరి అభిప్రాయమూ మారదని తెలిసినా అలా సమయం వృథా చేస్తూనే ఉంటాం. మీరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అందులో సమయం వెచ్చించండి, లేదంటే దాని మానాన దాన్ని సాగనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. 

అధికారానికి గుడ్డి విధేయత సత్యానికి అతి పెద్ద శత్రువు
నోబెల్ గ్రహీత జోహన్నెస్ స్టార్క్ వంటివారు కూడా ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంతోపాటు, దానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి జాతీయవాదాన్ని చేర్చి ఐన్ స్టీన్ పై దాడి ప్రారంభించారు. ఈ కుతంత్రాలు హాస్యాస్పదమైనవి, హానిచేయనివిగా ఐన్ స్టీన్ మొదట భావించినప్పటికీ, వాటిని తట్టుకోలేక అమెరికా పారిపోవాల్సి వచ్చింది. అందుకే "అధికారానికి గుడ్డిగా విధేయత చూపడం సత్యానికి అతిపెద్ద శత్రువు" అని చెప్పాడు. సోషల్ మీడియా కాలంలో, ఫేక్ న్యూస్ యుగంలో ఇది మరింత ముఖ్యమైనది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారంలో ఉన్నవారి చుట్టూ మేధావులు కూడా చేరి భజనలు చేయడం మీరు గమనించే ఉంటారు. అలా చేయడం ‘మంద మనస్తత్వం’, ‘సామూహిక పిచ్చితనం’ అంటాడు ఐన్ స్టీన్. అందుకే అధికారాన్ని గుడ్డిగా విధేయత చూపకండి. విమర్శనాత్మక దృష్టితో చూడండి. 

సైన్స్, సత్యం, విద్య అందరికీ... కొందరికి మాత్రమే కాదు
1930లలో వలస వెళ్లి 1940లో పౌరసత్వం పొందిన తర్వాత కూడా ఐన్‌స్టీన్ తరచుగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవాడు. అందుకే FBI 1932లో ఐన్‌స్టీన్‌పై ఒక ఫైల్‌ను ప్రారంభించింది. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. అమెరికాలోని తొలి నల్లజాతి కళాశాల అయిన లింకన్ యూనివర్శిటీని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చాడు. "సత్యం కోసం శోధించే హక్కు, సత్యమని భావించే వాటిని ప్రచురించి, బోధించే హక్కు" ఉండాలని ఉద్యమించాడు.  సైన్స్ ద్వారా వెలికితీసిన  ఆవిష్కరణలు, ఫార్ములాలు ఏ జాతికి, దేశానికి లేదా వర్గానికి చెందినవి కావు, మానవాళి అందరికీ చెందినవని ఎలుగెత్తి చాటాడు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా మారుతున్న కాలంలో ఈ దృక్పథం మరింత అవసరం. 

సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com

Advertisement
Advertisement