కుట్రకోణం ఛేదించే దిశగా.. | Sakshi
Sakshi News home page

కుట్రకోణం ఛేదించే దిశగా..

Published Sun, Dec 6 2020 5:17 AM

Investigation Is Accelerated On Attempt To Murder Case On Perni Nani - Sakshi

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రకోణం ఛేదించే దిశగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇటీవలే నిందితుడు బడుగు నాగేశ్వరరావును రెండ్రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. అలాగే పలువురు టీడీపీ నేతలకు నోటీసులిచ్చి వారి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ మృతి చెందినప్పటి నుంచి నిందితుడు మంత్రి ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు చెబుతున్నారు. మంత్రి తన తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో, ఆ తర్వాత ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అవకాశం కోసం ఎదురుచూసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన తర్వాత ఏం చెప్పాలి అనేది నాగేశ్వరరావును పురిగొల్పిన వారే అతనికి తర్ఫీదు ఇచ్చి ఉంటారని, అందుకే ఎన్నిసార్లు ప్రశ్నించినా సరిగా బదులిచ్చేవాడు కాదని పోలీసులంటున్నారు. ఈ ఘటనకు ముందు మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితులతో నాగేశ్వరరావు మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. 

కొల్లు తీరుపై పోలీసుల ఆగ్రహం
సీఆర్‌పీసీ సెక్షన్‌ 91 కింద ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పకపోగా తప్పించుకునే ధోరణిలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు మండిపడుతున్నారు. మాజీ మంత్రిని వెనకేసుకొస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు విషయంలో సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పెడితే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో భాగంగానే కొల్లుకు నోటీసులు ఇచ్చామని, అందులో తమకెలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని, ఇసుక కొరతతో పనుల్లేక పోవడం అనేది సాకు మాత్రమేనని ఎస్పీ ఎం.రవీంద్రబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి విచారణకు సహకరించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. 

నిందితుడు టీడీపీ కార్యకర్తే..
నిందితుడు నాగేశ్వరరావుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులకు సన్నిహితుడని పోలీసులు గుర్తించారు. 
► టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవికి నిందితుడు స్వయానా సోదరుడు.
► మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను పోలీసులు విచారించిన సమయంలో ఆయనకు మద్దతుగా నాగేశ్వరరావు కూడా స్టేషన్‌ వద్దకు వచ్చాడు.
► రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి కొల్లు విడుదలైనప్పుడు స్వాగతం పలికిన వారిలో నిందితుడు ఉన్నాడు. మచిలీపట్నంలో కొల్లుకు స్వాగత ర్యాలీలో కూడా పాల్గొన్నాడు. 
► స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నేతలు నామినేషన్‌ వేసిన సమయంలో నాగేశ్వరరావు వారితో ఉన్నాడు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొల్లుకు మద్దతుగా
ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement