ఐటీఆర్‌ వెరిఫికేషన్‌! ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ మెసేజ్‌చూశారా? లేదంటే? | ITR Verification: Read This Income Tax Department Important Message For Taxpayers Over E-filling - Sakshi
Sakshi News home page

ITR Verification Important Message: ..ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ మెసేజ్‌చూశారా? లేదంటే?

Published Mon, Aug 28 2023 10:26 AM

ITR verification Read this Important message for taxpayers - Sakshi

డిపార్ట్‌మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్‌ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ-ఫైలింగ్‌ ప్రాసెస్‌ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్‌ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు.

గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్‌వాలిడ్‌ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000; రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది.  

ఈ-వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ-వెరిఫై వద్దనుకుంటే ఫారం-Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్‌పోస్ట్‌లో పంపండి. పోర్టల్‌ ద్వారా చేయండి. ఆధార్‌ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్‌ ద్వారా లేదా డీమ్యాట్‌ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్‌ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్‌కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు.  లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్‌ వ్యక్తి వేయొచ్చు. మొబైల్‌ నంబర్‌ను వెంటనే ఆధార్‌తో అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్‌పోస్ట్‌లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి.  

రిఫండ్‌ క్లెయిమ్‌ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు .. డిపార్ట్‌మెంట్‌ వారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement