ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గుముఖం | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గుముఖం

Published Sat, Jun 10 2023 4:01 AM

Inflow in equity mutual fund halves to Rs 3,240 crore in May on profit booking - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మే నెలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో.. నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఇది గడిచిన ఆరు నెలల కాలంలో నెలవారీ అత్యంత కనిష్ట స్థాయి ఈక్విటీ పెట్టుబడులు కావడం గమనించొచ్చు. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 27వ నెలలోనూ నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన రూ.6,480 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే సగానికి సగం తగ్గాయి.

అంతకుముందు నెల మార్చిలోనూ రూ.20,534 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) మే నెలకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం అన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన నికర పెట్టుబడులు రూ.57,420 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఏప్రిల్‌ నెలలో వచ్చిన రూ.1.21 లక్షల కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా తగ్గాయి. 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తులు రూ.43.2 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్‌ చివరికి ఇవి రూ.41.62 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఆల్‌టైమ్‌ గరిష్టానికి సిప్‌
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు మే నెలలో వచ్చాయి. ఇది నెలవారీ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి కావడం గమనించొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన సిప్‌ పెట్టుబడులు రూ.13,728 కోట్లుగా ఉన్నాయి. అనిశ్చితుల్లోనూ పరిశ్రమ మంచి పనితీరు చూపించినట్టు యాంఫి సీఈవో ఎన్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు. ‘‘మార్కెట్లు పెరగడంతో లాభాల స్వీకరణకు తోడు, వేసవి విహార పర్యటనలు, విద్యా సంబంధిత ఖర్చులు మే నెలలో పెట్టుబడులు తగ్గడానికి కారణమై ఉండొచ్చు’’అని కోటక్‌ మహీంద్రా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ డిజిటల్‌ బిజినెస్‌ సేల్స్‌ హెడ్‌ మనీష్‌ మెహతా తెలిపారు. లాభాల స్వీకరణకు తోడు, అమెరికా డెట్‌ సీలింగ్‌ పెంచడం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళనతో ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఉండొచ్చని మార్నింగ్‌స్టార్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ మెల్విన్‌ శాంటారియా అభిప్రాయపడ్డారు.  

విభాగాల వారీగా..
► లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.1,362 కోట్లను ఆకర్షించాయి.
► ఫోకస్డ్‌ ఫండ్స్‌లోకి రూ.944 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి రూ.504 కోట్ల చొప్పున వచ్చాయి.
► డెట్‌ పథకాలు రూ.46,000 కోట్లను ఆకర్షించాయి.
► డెట్‌ విభాగంలో లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ.45,234 కోట్లు రాగా, హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి రూ.6,093 కోట్లు వచ్చాయి.
► ఓవర్‌నైట్‌ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.18,910 కోట్లను ఉపసంహరించుకున్నారు.  
► ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లోకి రూ.6,694 కోట్లు వచ్చాయి.  
► బ్యాలన్స్‌డ్‌ హైబ్రిడ్, అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ పథకాల నుంచి రూ.997 కోట్లు బయటకు వెళ్లాయి.  
► గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేటెడ్‌ ఫండ్స్‌లోకి రూ.103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే విలువల పరంగా తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నట్టు ఫయర్స్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గోపాల్‌ కావలిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement