ఆ పథకాల నిధుల విడుదలకు ఆదేశాలివ్వండి | Sakshi
Sakshi News home page

ఆ పథకాల నిధుల విడుదలకు ఆదేశాలివ్వండి

Published Thu, May 9 2024 5:20 AM

Women approached the High Court against the decision of the Election Commission

ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన మహిళలు

నిధులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడతాం 

నాలుగేళ్లుగా ప్రభుత్వం ‘వైఎస్సార్‌ ఆసరా’,  ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ను అమలుచేస్తోంది 

నిధుల పంపిణీ ఆవశ్యకతను, అత్యవసరాన్ని వివరిస్తూ ఈసీకి వినతిపత్రాలిచ్చాం 

దానిపై నిర్ణయం తీసుకునేలా ఈసీని ఆదేశించండి 

హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం 

ఈ వినతులపై నిర్ణయం తీసుకోండి.. దానిని ప్రొసీడింగ్స్‌ రూపంలో మా ముందుంచండి 

ఈసీకి హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: లబ్దిదారులకు వైఎస్సార్‌ ఆసరా నాల్గవ విడత నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినివ్వకపోవడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని గుంటూరు నగరానికి చెందిన కె. వెంకటదుర్గాదేవి, జె. రత్నకుమారి దాఖలు చేశారు. ఆసరా కింద వెంటనే నిధుల విడుదలకు ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు.

అలాగే, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ఈసీ అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి. శివపార్వతి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీచేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ లంచ్‌మోషన్‌ రూపంలో బుధవారం అత్యవసరంగా విచారణ జరిపారు. 

నిధుల పంపిణీ ఆవశ్యకతపై వినతిపత్రాలిచ్చాం.. 
అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభు­త్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాల కింద నిధుల పంపిణీకి ఈసీ అనుమతిని నిరాకరించిందన్నారు. లబి్ధదారుల గుర్తింపు ఎప్పు­డో పూర్తయిందని, నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా చేశామన్నారు. 

ఈ రెండు పథ­కాలు కొత్తవి కావని, నాలుగేళ్లుగా అమలవుతున్నాయని చెప్పారు. నిధుల పంపిణీకి బ్రేక్‌వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధుల పంపిణీ అత్యవసరాన్ని వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు ఇచ్చిందన్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని గురువారం ఉదయం కోర్టు ముందుంచేలా ఈసీని  ఆదేశించాలని ఆయన కోరారు. 

మీ నిర్ణయాన్ని మా ముందుంచండి.. 
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌.. ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా పథకాల కింద లబి్ధదారులకు నిధుల పంపిణీ విషయంలో అత్యవసరాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకుని, దానిని ప్రొసీడింగ్స్‌ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ఆదేశించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. చేయూత, విద్యాదీవెన నిధుల పంపిణీ నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యాలతో తాజా వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.  

మహిళలు ఇబ్బంది పడతారు.. 
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్‌ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నాలుగు విడతల్లో నిధులను విడుదల చేస్తుందన్నారు. ఈ పథ­కం కింద 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 79.84 లక్షల మంది ఈ నాలుగేళ్లలో రూ.25,570 కోట్ల మేర లబ్దిపొందారన్నారు. ఇప్పటికే మూడు విడతల కింద రూ.4,551 కోట్ల మేర నిధులు పంపిణీ చేశామని, నాల్గవ విడత కింద రూ.1,843 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. 

ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతిని నిరాకరించిందన్నారు. అలాగే, ఆర్థికంగా వెను­క­బడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద రూ.15వేల ఆర్థికసాయం అందిస్తోందన్నారు. మూడు విడతలుగా ఈ మొత్తం చెల్లించారని.. ఇప్పడు మరో విడత మొత్తం చెల్లించాల్సి ఉందన్నారు.

 అలాగే, ఈబీసీ నేస్తం కింద నిధుల పంపిణీకి కూడా ఈసీ అనుమతిని నిరాకరించిందని తెలిపారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక అవసరాలకు అప్పులుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యంచేసుకుని నిధుల పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని కోరారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement