‘పొదుపు’ మహిళలకు వ్యక్తిగత రుణాలు  | Sakshi
Sakshi News home page

‘పొదుపు’ మహిళలకు వ్యక్తిగత రుణాలు 

Published Sat, Apr 15 2023 4:29 AM

Personal Loans for Saving group Women - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పొదుపు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులైన మహిళలకు వైఎస్‌ జగన్‌ అందించిన చేయూత అక్కచెల్లెమ్మలు మరింతగా పురోభివృద్ధి సాధించేందుకు బాటలు వేసింది. రాష్ట్రంలో పొదుపు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలకు సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానూ వ్యాపారానికి బ్యాంకు రుణాలు లభించనున్నాయి.

ఈ రుణాల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకొంది. సెర్ప్‌ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వి. హేమ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌  ఓం నారాయణ శర్మ, సెర్ప్‌ బ్యాంకు లింకేజీ విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కేశవ్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇప్పటివరకు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు బ్యాంకులు సంఘాల ప్రాతిపదికన మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. మహిళలు పొదుపు సంఘంగా ఏర్పడి, నెలనెలా కొంత మొత్తం పొదుపు చేసుకుంటుంటే.. సంఘాల పని తీరు ఆధారంగా బ్యాంకులు వాటిలోని మహిళలందరికీ ఉమ్మడిగా మాత్రమే,  సంఘం పేరుతోనే రుణాలిస్తున్నాయి. ఈ రుణాలతో వారి అత్యవసర కుటుంబ అవసరాలను తీర్చుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. దీంతో అప్పట్లో పొదుపు సంఘాలపై వడ్డీలు, చక్రవడ్డీల భారం పడి పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయాయి. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించలేకపోయాయి. నాలుగో వంతుకు పైగా సంఘాలు నిరర్ధక ఆస్తులు(ఏన్‌పీఏ)గా ముద్రపడ్డాయి. ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలంతా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారింది. అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి తోడ్పాటునందించారు. దీంతో పొదుపు సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. ఇప్పుడు మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకున్న రుణాలను నూటికి 99.55 శాతం మేర తిరిగి చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.  

సీఎం జగన్‌ అందించిన ‘ఆసరా’ 
చంద్రబాబు చేసిన మోసంతో దారుణంగా దెబ్బ తిన్న మహిళల పొదుపు సంఘాలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్‌ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ. 25,571 కోట్ల మేర అప్పులు ఉండేవి. ఆ రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళల చేతికి అందిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి రాగానే, ఇచ్చిన హామీని అక్షరాలా అమలుచేస్తున్నారు.

వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్‌ మొత్తం రూ.19,178 కోట్లు అందజేశారు. దీనికి తోడు గత చంద్రబాబు ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిన పొదుపు సంఘాలపై సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ అమలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ భారాన్ని కూడా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా రూ. 3,615. 29 కోట్లు వడ్డీని అక్కచెల్లెమ్మలకు అందజేసింది. 

పెరిగిన మహిళా సంఘాల పరపతి 
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. వ్యాపారాలనూ వృద్ధి చేసుకుంటున్నారు. దీంతో మహిళా సంఘాల పరపతి పెరిగింది. పెద్ద ఎత్తున రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు బ్యాంకులు పొదుపు సంఘాలకు మొత్తం రూ. 1,09,956.87 కోట్ల రుణాలు అందజేశాయి.

ఒకప్పుడు ఒక్కొక్క సంఘం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల మధ్య మాత్రమే రుణాలు పొందగలిగేవి. ఇప్పుడు 3,00,468 సంఘాలు (మూడో వంతుకు పైగా) రూ. 10 లక్షలకు పైబడి రుణాలు పొందుతున్నాయి. వీటిలో 41,139 సంఘాలు ఏకంగా రూ. 20 లక్షల మేర రుణాలు పొందడం గమనార్హం. ఈ రుణాలతో వ్యాపారాభివృద్ధి చేసుకున్న పొదుపు సంఘాల మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారు ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు చేసుకోగల స్థాయికి వచ్చారు.

అయితే, వారికి బ్యాంకులు వ్యక్తిగతంగా రుణం ఇవ్వకపోవడం అవరోధంగా మారింది. ఇప్పుడు వీరికి రుణాలివ్వడానికి ఎస్‌బీఐ ముందుకు వచ్చింది. వారు ఏర్పాటు చేసుకొనే వ్యాపార సంస్థనుబట్టి సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రుణాలు లభిస్తాయని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement